Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండుశాతం చందాను వ్యతిరేకిస్తున్నాం : జాక్టో
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమలుపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్ల నగదు రహిత వైద్యం అమలు కోసం వేతనాల నుంచి రెండు శాతం చందా వసూలు చేయడానికి టీఎన్జీవో అంగీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో జాక్టో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం సభ్యులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ, కృష్ణుడు, పార్థసారధి, సారయ్య, హేమచంద్రుడు, లక్ష్మణ్‌నాయక్, రాము, విఠల్, దానయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా విధివిధానాలు విడుదల చేయకుండా రెండు శాతం చందాను వేతనాల నుంచి మినహాయిస్తూ ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని ఖండించారు. 317 జీవోకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చాలని కోరారు. పరస్పర బదిలీలకు సంబంధించి అన్ని అంశాలనూ పరిశీలించి వెంటనే ఉత్తర్వులివ్వాలని సూచించారు. బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ కేసులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. సాధారణ బదిలీలు, పదోన్నతులు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పదివేల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులను, అప్‌గ్రేడ్ చేసిన పండితులు, పీఈటీ పోస్టులకు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని కోరారు.