Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూడీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు
నవతెలంగాణ- ఖమ్మం
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీయుడీఎఫ్ (తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం) రాష్ట్ర కార్యదర్శి డిజి.నర్సింహారావు విమర్శించారు. శుక్రవారం సీఐటీయూ, టీయుడీఎఫ్, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. త్రీ టౌన్ ప్రజాసంఘాల కన్వీనర్ భూక్యా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో డిజి.నర్సింహారావు మాట్లాడారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు, 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్, కొత్త రేషన్ కార్డుల మంజూరు, నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదన్నారు.
రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ.. రెండు నెలల నుంచి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజాసమస్యలపై సర్వే నిర్వహించామని చెప్పారు. ఈ సర్వేలో ప్రజలు చాలా సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. నివాస ప్రాంతాల్లో సైడ్ డ్రైనేజ్, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వేసవికాలంలో ప్రజలకు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం మంచి నీటి బోరు ఏర్పాటు చేయాలన్నారు. గోళ్లపాడు పనులు నత్తనడకన సాగుతున్నాయని, తక్షణమే పూర్తిచేయాలని కోరారు. మున్నేరు ఇరువైపుల కరకట్ట నిర్మాణం చేపట్టాలని, మున్నేరు ఏటి పైన కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని, లేనియెడల రానున్న రోజుల్లో ప్రజలను పెద్దఎత్తున సమీకరించి మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, సీఐటీయు జిల్లా నాయకులు వై.విక్రమ్, టీయుడీఎఫ్ జిల్లా కార్యదర్శి యర్రా శ్రీనివాస్‌రావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అఫ్రోజ్ సమీనా తదితరులు పాల్గొన్నారు.