Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
- కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్వీకే వద్ద అరవింద్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-హైదరాబాద్
రాజ్యాంగాన్ని తప్పక మారుస్తామని, సెక్యులర్ పదమే ఉండనీయం అని అధికార మదంతో, అహంభావంతో బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల అరవింద్ వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం కేవీపీఎస్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. అరవింద్ కబర్దార్.. రాజ్యాంగం జోలికి వస్తే తాటతీస్తాం అంటూ నినదించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ రాజ్యాంగంపట్ల మాట్లాడినప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు స్పందిస్తూ ''రాజ్యాంగం జోలికి వస్తే నిన్ను తుకడ తుకడ చేస్తాం. ఏది రాజ్యాంగాన్ని ముట్టుకొని చూడు బిడ్డా.. అని గట్టిగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీ పార్టీ ఎంపీ అరవింద్‌ను కూడా తుకడ తుకడ చేస్తారా? '' అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది నోటిదూల మాత్రమే కానీ.. వాస్తవంగా రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రవేశపెట్టాలనుకునే రాజకీయ సిద్ధాంతం కలిగిన ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచే పార్టీ బీజేపీ అని విమర్శించారు. అరవింద్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం కాదని, అది బీజేపీ విధానమని చెప్పారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. సామాజిక, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలని కోరారు. అందరిపాలిట బీజేపీ ఎలా శత్రువో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు టి.సుబ్బారావు, కొండూరి యాదగిరి, నాయకులు జి.రాములు, బిజీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు కడమంచి రాంబాబు, కేవీపీఎస్ నాయకులు వెంకట్రావ్, సీహెచ్ బిక్షపతి, టి. యాదగిరి, భాను, రఘు, వెంకన్న, చెన్నయ్య, వంశీ, సుధీర్, ఎంఆర్. విజరు తదితరులు పాల్గొన్నారు.