Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహస్యంగా రాష్ట్రంలో తిరుగుతున్న బృందాలు
- వరంగల్ సభకు ఎంత మందిని తరలించారు
- ఏ నియోజక వర్గం నుంచి ఎక్కువగా వచ్చారు?
- అసలు రాని నియోజకవర్గాలేంటిి?
- జనసమీకరణ చేయని వారి గుండెల్లో గుబులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు సంఘర్షణ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన రాహుల్‌గాంధీ...తెలంగాణపై నజర్ పెట్టారు. సభా వేదిక నుంచి పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తూనే కలిసికట్టుగా పని చేయాలని ఉద్భోందించిన విషయం తెలిసిందే. ఆయన ఏదో చెప్పి వదిలేయకుండా తన బృందాలతో రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ నుంచి కొన్ని రహస్య బృందాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. అట్ల వచ్చి ఇట్ల వెళ్లిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాయి. గ్రామాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంతోపాటు పార్టీ పునాది పటిష్టత ఎలా ఉన్నది. ముఖ్యంగా నాయకులు ఎలా పని చేస్తున్నారు. నాయకుల మధ్య ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టి పని చేస్తున్నారా? లేదా? తదితర అంశాలను పరిశీలించే పనిలో పడ్డాయి. ఇటీవల వరంగల్ నగరంలో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ సభ కాంగ్రెస్‌కు మంచి ఇమేజ్ తీసుకొచ్చినప్పటికీ...కీలకమైన నాయకుల పాత్ర ఎలా ఉందనేది పరిశీలన బృందాల ముఖ్య ఉద్దేశమని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములు, అంతర్గత కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంతో ఆ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాహుల్‌గాంధీ అందర్ని కూర్చొబెట్టి పరిస్థితిని చక్క దిద్ది పంపారని మీడియాకు చెప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాహుల్ చెప్పిన స్ఫూర్తిని ప్రదర్శించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.గతంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభలకు మించి కాంగ్రెస్ సభకు జనాన్ని సమీకరిస్తామంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కావాలంటే తలకాయలు లెక్క పెట్టుకోవాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలను పార్టీలోని సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. పార్టీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సభను విజయవంతం చేయాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం నల్లగొండ జిల్లాకు జనాన్ని తామే సమీకరిస్తామనీ, ఇంకెవరూ రావాల్సిన అవసరం లేదని మీడియాకు చెప్పారు. చివరకు నల్లగొండ జిల్లా సమీక్షకు రేవంత్‌రెడ్డిని రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసినట్టు వార్తలొచ్చాయి. అయినా వారిని కాదని సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి,దామోదరరెడ్డి చొరవతో ఆ సమావేశం సక్సెస్ అయింది. చివరకు ద్వితీయ శ్రేణి నాయకులు మునుగోడు, నకిరేకల్, హుజూర్నగర్, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి తరలించారని చెబుతున్నారు.
మిగతా నియోజవర్గాల నుంచి నాయకులు మాత్రమే తమ వాహనాల్లో వచ్చారని అంటున్నారు. ఇలాంటి విషయాలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంలో రాహుల్ బృందాలు ఇక్కడ వాలిపోయాయి. రైతు సంఘర్షణ సభా ప్రాంగణం సామర్థ్యం, ట్రాఫిక్‌జామ్, వాహనశ్రేణి ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చిందనే ఆ అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నాయి. దీని ప్రకారం హైదరాబాద్, వరంగల్ రోడ్ ట్రాఫిక్ జామైంది. కానీ మంథని,ములుగు, భూపాలపల్లి రోడ్లో ఖాళీగా ఉందనీ, అక్కడి నుంచి జనసమీకరణ జరగలేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఎల్బినగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం కాంగ్రెస్ బలంగా ఉన్నప్పటికీ నాయకుల నిర్లక్ష్యం కనపడుతున్నదన్న చర్చ జరుగుతున్నది. హైదరాబాద్ మహానగరంలో నాయకులు షోపుటఫ్ మాత్రమే. నాయకులు తప్ప జనాన్ని సమీకరించ లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లా నేతలది ఇదే పరిస్థితి. కొంత మంది నాయకులు మాత్రమే ఆ సభను విజయవంతం చేసేందుకు సీరియస్‌గా కృషి చేశారు. మరికొంత మంది రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని జనసమీకరణ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసి, వారిపై కొరడా ఝ్వలిపించేందుకు రాహుల్ సిద్దమవుతున్నారు. అంతేకాదు అనుబంధ సంఘాల చైర్మెన్లు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం వేదికపై కూర్చున్నారు తప్ప అసలు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ నిర్ణయంమేరకు జనసమీకరణ చేయకుండా వాళ్లుతెస్తారని వీళ్లు...వీళ్లు తెస్తారని వాళ్లు అనే నిర్లక్ష్య దోరణితో వ్వవహరించారని రాహుల్ బృందాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను విజయవంతం చేయడంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన నేతలకు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో జనసమీకరణ చేయని నేతల గుండెల్లో గుబులు పడుతున్నదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది.