Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సాంకేతికతను పది నెలల్లో అభివృద్ధి చేసినట్టు సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినరు నందకూరి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీసీఎంబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లనేవి ప్రముఖ వ్యాక్సిన్ టెక్నాలజీల్లో ఒకటని చెప్పారు. వీటి శక్తి సామర్థ్యాలు కోవిడ్-19 సమయంలో ప్రపంచానికి అవగతమయ్యాయన్నారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సాంకేతికత అభివృద్ధి చేసిన తీరును ఆయన వివరించారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సాంకేతికతలో మొదట వ్యాధి కారక సూక్ష్మజీవుల ప్రొటీన్ లేదా దానిలో కొంత భాగాన్ని మనిషిలో గానీ లేదా జంతువుల్లో ప్రవేశపెడతారు. తద్వారా శరీర కణాల్లో ఉత్పత్తి అయిన ప్రొటీన్ రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి వ్యాధి నిరోధక కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి అయిన ప్రొటీన్స్ రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి వ్యాధి నిరోధక కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ వ్యాధి నిరోధక కణాలు ప్రత్యక్ష సూక్ష్మజీవితో ఇన్ ఫెక్షన్ సంభవించినప్పుడు శరీరంలో వాటి వ్యాప్తిని నిరోధించి వ్యాధిని నిర్మూలిస్తాయని డాక్టర్ వినరు వివరించారు.
పరిశోధన సాగిందిలా...
సార్స్ కోవిడ్-2 స్పైక్ ప్రొటీన్‌కు సంబంధించిన ఎంఆర్ఎన్ఏను ఎలుకలకు రెండు మోతాదులిచ్చారు. దానికి వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను గమనించారు. ఉత్పత్తి అయిన యాంటీ స్పైక్ యాంటీబాడీలు మనిషి శరీరంలో కరోనా వైరస్ల బంధనాన్ని నిరోధించడంలో 90 శాతం ప్రభావం చూపించినట్టు కనుగొన్నారు. ప్రస్తుతం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రి క్లినికల్ అధ్యయనం కొనసాగుతున్నది.
ఉపయోగం....
ఇప్పటికీ అనేక రోగాలను నిరోధించేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో వ్యాక్సిన్ల తయారీకీ పడుతున్న సమయం చాలా ఎక్కువగా ఉంటున్నదని ప్రపంచం గుర్తించింది. ఈ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికీ, ఆయా రోగాలకు వ్యాక్సిన్లను వేగంగా అందుబాటులోకి తేవడానికి ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఉపయోగనున్నది. డెంగ్యూ, క్షయ, మలేరియా తదితర అంటురోగాలకు వ్యాక్సిన్లు కనుగొనేందుకు నూతన సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినరు నందకూరి ఈ సందర్బంగా వివరించారు.
సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ, కోవిడ్-19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల విషయంలో భారతదేశం ప్రశంసలు అందుకున్నదని గుర్తుచేశారు. అయినప్పటికీ ఫైజర్, మోడర్నా వంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల సాంకేతికత మన దగ్గర లేదని తెలిపారు. జెన్నోవా బయో కంపెనీతో కలిసి సీసీఎంబీ ఆ సాంకేతికతను అభివృద్ధి చేసిందని తెలిపారు.