Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ
నవతెలంగాణ- కంఠేశ్వర్
బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరీల కార్మికులందరికీ వేతనాలు పెంచాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ అధ్యక్ష కార్యదర్శులకు శుక్రవారం డిమాండ్ నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంతరం పెరుగుతున్న ధరలతో కుటుంబాలు గడవడం కష్టంగా ఉందన్నారు. బీడీ కార్మికులు చేసే పనికి అతి తక్కువ వేతనం రావడంతో పెరిగే ధరల ముందు వచ్చే ఆదాయం ఎటూ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుందన్నారు. వేతనాలను వినిమయ ధరల సూచీకి అనుగుణంగా సవరించడం లేదన్నారు. అతి తక్కువ రేట్లకే (కూలి) 12-14 గంటలు పని చెయ్యాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన 7వ వేతన కమిషన్.. కనీస వేతనం రూ.18,000 అమలు చేయాలని సిఫారసు చేసిందని చెప్పారు. దీన్ని ప్రాతిపదికగా చేసుకొని సీఐటీయూతో సహా కేంద్ర కార్మిక సంఘాలు ఈ కాలంలో పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని నెలకు రూ.21వేల వేతనం నిర్ణయించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయన్నారు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని, బీడీ కార్మికులకు గతంలో కూడా వేతనాలు పెద్దగా పెరిగింది లేదని తెలిపారు. కనీస వేతనం రూ.21,000 ఇవ్వాలని, బీడీ రోలర్స్కు వెయ్యి బీడీలకు కనీస కూలి రూ.807 ఉండాలని కోరారు. క్లర్క్, చెకర్స్, బట్టీ చటాన్ కార్మికులు నెలసరి వేతనాలు పొందే వివిధ కేటగిరీల కార్మికులందరికీ కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, నెలకు 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.ఎల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూర్జహాన్ పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాలివ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.రమ డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చిం దని, కానీ రాష్ట్రంలో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వలేదని చెప్పారు. 40 ఏండ్లుగా ఎడపల్లి మండలం నెహ్రూనగర్ పేదలు కిరాయి ఇండ్లల్లోనే ఉంటున్నారని, వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే డబుల్ బెడ్రూం ఇండ్లల్లో తామే గృహప్రవేశం చేపిస్తామని, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఇండ్లు నిర్మిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, నాయకులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్‌గౌడ్, ఏశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.