Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలో అడుగడుగునా నిలదీత
- నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఆగ్రహం
- సంగ్రామ యాత్రకు ముగింపందుకేనా?
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'సార్ మీరొస్తారు. చెబుతారు. పోతారు. బాగానే ఉందికానీ మీరు మావైపు మళ్లీ చూడరు'... అంటూ ఓ మహిళా బండి సంజరుని నవ్వుతూనే అడిగేశారు. అందుకు బండి అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏ అమ్మ నీవు నాకు ఓటేయ్యకు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. సార్ గ్యాస్ ధరలు పెంచారు. పెట్రోలు, డిజీల్ ధరలు పెంచారు. గ్యాస్ వెయ్యి రూపాయలైంది. ఎట్లా బతికేది. పెట్రోలు ధర నూట ఇరవై అయింది. ఏడికన్న పోవాలంటే పోలేకపోతున్నాం. కూరగాయలు కొనలేకపోతున్నం. ఏం తినాలే..ఎట్లా బతకాలే..అని మరో చోట మహిళలు సంగ్రామ యాత్రలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వీడియో కూడా సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు చెబుతున్నప్పటికీ...బండి సంజరు యాత్రకు అడుగడుగునా ఇలాంటి పరిస్థితీ దాపురించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు...కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువులు ధరలను ప్రస్తావించకపోయినా, వాటితో బాధపడుతున్న ప్రజలు అనేక చోట్ల నిలదీస్తున్నారు. 2014లో గ్యాస్ సిలిండర్ రూ. 470 ఉండగా, అది నేడు రూ 1052కి చేరుకుంది. ఈ సమస్యను నేరుగా ఎదుర్కొంటున్న మహిళలు బీజేపీని కడిగిపారేస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభంలో పెద్దగా ప్రశ్నలు రాకపోయినా...మూడో విడతలో క్రమక్రమంగా బండి సంజరుకి జనం నుంచి ప్రశ్నలు ఈటెల్లా దూసుకొచ్చాయి. ఎక్కడైతే సభ జరుగుతుందో,అక్కడికి ముందుగానే బీజేపీ బృందం వెళ్లి సార్ చెప్పింది వినేలా మేనేజ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఎక్కడైతే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు...అక్కడి స్థానిక నేతలు ఒప్పందాలు చేసుకున్నారని విమర్శలున్నాయి. అసలే బీజేపీ రాజకీయంగా బలహీనంగా ఉందనేది తెలిసిందే. కొన్ని గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే వారే లేకపోవడం, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించడం, మరోవైపు ఎండ తీవ్రత పెరిగిపోవడం...ఇలా అనేక కారణాలతో బండి సంజరు ప్రజా సంగ్రామ యాత్రను ఆపేసే పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తున్నది. మరోవైపు కమలం పార్టీలో కుతకుత ఉడుకుతున్న అంతర్గత విభేదాలు సైతం బండి యాత్రపై ప్రభావాన్ని చూపించాయని తెలిసింది. జనం లేని యాత్రతో పార్టీకి వచ్చే ప్రతిష్ట కంటే ఉన్నది కాస్త దిగిజారిపోతున్నదంటూ ఆ పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. ఒక గ్రూప్ మొత్తం బండికి సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ఇలా యాత్రకు పార్టీ నుంచి పూర్తి మద్దతు లేకపోవడం, ప్రజల నుంచి ప్రశ్నల వర్షం తదితర కారణాలతో బీజేపీ యాత్రను ఆపేసిందనే వార్తలొస్తున్నాయి. ప్రజాసంగ్రామ యాత్రకు ముందుగా ప్రధాన మంత్రి మోడీ వస్తారంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. క్షేత్ర స్థాయిలో బీజేపీ పరిస్థితులను అంచనా వేసుకున్న తర్వాత మోడీ...అమిత్‌షాను ముగింపు సభకు పంపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ రైెతాంగ సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన అమిత్‌షాకు పెద్ద ఆదరణ దక్కలేదు. అప్పుడే ఆయన బీజేపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం.ఇదే తరహాలో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు కూడా ఆశించిన జనం రాలేదనే టాక్ వినిపిస్తున్నది.