Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రాంట్లలో రూ.30 వేల కోట్ల తరుగు
- తప్పిన రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు
- వచ్చింది రూ.8,619 కోట్లే
- మార్చి చివరి నాటికి ఆర్థిక పరిస్థితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇటీవల కేంద్ర ఆర్థికశాఖతో జరిగిన సమావేశంలో తెలంగాణ పట్ల వివక్ష తగదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థిక సాయాలు, గ్రాంట్లు, వెనుకబడిన జిల్లాలకు నిధుల విషయంలో తాత్సారం తగదంటూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు... కేంద్రానికి విన్నవించారు. కేంద్రం వైఖరి వల్ల తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు కుంటు పడుతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు వివక్షాపూరితంగానే ఉందని మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆవేదన నిజమేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక చూస్తే విదితమవుతున్నది. గత మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ విడుదల చేసిన లెక్కల ప్రకారం... కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లలో ఈసారి భారీ కోతలు పడ్డాయి. ఈ క్రమంలో మోడీ సర్కార్ మీద గంపెడాశలు పెట్టుకుని అతి అంచనాలకు పోయిన టీఆర్ఎస్ సర్కారుకు నిరాశ తప్పలేదు.
కాగ్ లెక్కల ప్రకారం... గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో మొత్తం రూ.38,669 కోట్లు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసుకుంది. అందులో గత మార్చి నాటికి కేవలం రూ.8,619 కోట్లే వచ్చాయి. అంటే రూ.30,050 కోట్ల మేర అంచనాలు తప్పాయన్నమాట. పూర్తి స్థాయిలో కాకపోయినా అందులో కనీసం సగమైనా వస్తాయని తాము భావించామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ తమ అంచనాకు భిన్నంగా కేంద్రం మొండి చేయి చూపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.1,031 కోట్లను కూడా కేంద్రం విడుదల చేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్రానికి మొత్తం రూ.35,520 కోట్లు రావాల్సి ఉండగా... ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.34,489 కోట్లనే కేంద్రం విడుదల చేయటం గమనార్హం. ఇదే సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.13,147 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇందులో సీజీఎస్టీలో రాష్ట్ర వాటాను రూ.5,572 కోట్లుగా పేర్కొన్నారు.
మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ... (రూ.కోట్లలో)
అంశం అంచనాలు వాస్తవాలు
1) జీఎస్టీ 35,520 34,489
2) స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 12,500 12,732
3)భూముల అమ్మకాలు 6.31 0.26
4)అమ్మకపు పన్ను 26,500 26,973
5)ఎక్సైజ్ సుంకాలు 17,000 17,482
6)కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 8,721 13,147
7)ఇతర పన్నులు, సుంకాలు 6,652 5,525
8) పన్నేతర ఆదాయం 30,557 8,857
9) కేంద్ర గ్రాంట్లు,
ఇతర సాయాలు 38,669 8,619