Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఏఏఆర్ఎమ్ స్నాతకోత్సవంతో వెంకయ్యనాయుడు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వ్యవసాయ సామర్థ్యాన్ని, నాణ్యతను పెంచే దిశగా పరిశోధనలను విస్తృతం చేయాల్సిన అవసరముందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. వ్యవసాయంలో దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని సూచించారు. అందుకోసం నిధులను పెంచాలని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఎన్ఏఏఆర్ఆర్ఎమ్) స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటను రక్షించుకోవటం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచటం, పౌష్టికాహార భద్రతను కాపాడే లక్ష్యంగా పరిశోధనలు ఉండాలని చెప్పారు. కొత్త సాంకేతిక పద్ధతులను, సుస్థిర వంగడాలను వృద్ధి చేయటం మాత్రమే లక్ష్యం కాకూడదని తెలిపారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్య పరచాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు, మెడల్స్‌ను అందజేశారు. జెనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్, నానో టెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టి సారించాలన్నారు. డ్రోన్స్, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతను కూడా వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్ మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్-ఎన్ఏఏఆర్ఎమ్ హెడ్ డాక్టర్ రంజిత్ కుమార్, ఐసీఏఆర్ డీజీ, డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ టి. మహాపాత్ర, సంస్థ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావ్, డీన్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ కో-ఆర్డినేటర్ బి.గణేశ్కుమార్తోపాటు విద్యార్థులు, వ్యవసాయ రంగ నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు.