Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పబ్లిక్ ప్రాసిక్యూటర్‌పై జూనియర్ మహిళా న్యాయవాది ఫిర్యాదు
- గవర్నర్, సీఎం, హైకోర్టు చీఫ్ జస్టిస్, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బెల్లం ప్రతాప్ తనను లైంగికంగా వేధించారంటూ రాష్ట్ర గవర్నర్, సీఎం, హైకోర్టు చీఫ్ జస్టిస్, జాతీయ ఎస్సీ కమిషన్‌కు జూనియర్ మహిళా న్యాయవాది ఫిర్యాదు చేశారు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖచ ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉత్తర్వు ద్వారా నియమింపబడి, సదరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర జూనియర్‌గా పనిచేస్తున్నానని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనపు పీపీ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఆరోపించారు. పరుష పదజాలంతో మాట్లాడుతూ వేధించారని ఫిర్యాదు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు మరో ఇద్దరు న్యాయవాదులు కూడా బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై ఖమ్మంలో జడ్జిలు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు లొంగిపోతే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపించారని, మంత్రి దగ్గరకు తీసుకెళ్తానని, పదవులు ఇప్పిస్తానని చెప్పారని ఆరోపించారు. ఈ వేధింపులపై మరో మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు చెప్పుకొని బాధపడ్డానని తెలిపారు. ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు తీసుకున్నానని, ఎవరికైనా చెబితే న్యూడ్ ఫొటోలు, వీడియోలు తమ దగ్గర ఉన్నాయని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మానసిక వేధింపులకు తాళలేక తాను ఆత్మహత్యాయత్నం కూడా చేశానని చెప్పారు. తనను వేధించిన ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.