Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీవో నెంబర్ 167 ప్రకారం టీఆర్ఎస్కు కేటాయించిన విధంగానే తమ పార్టీ కార్యాలయాలకూ అన్ని జిల్లాల్లో స్థలాలు కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు శనివారం ఆయన లేఖ రాశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రాల్లో ఒక ఎకరా వరకు స్థలం కేటాయిస్తామంటూ 2018, ఆగస్టు 16న జీవో నెంబర్ 167ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) జాతీయ పార్టీ అని తెలిపారు. తమ పార్టీకి ఆఫీసు స్థలాలు లేని జిల్లాల్లో స్థలాలను కేటాయించాలని కోరారు. దీనికోసం అర్జీలు పెట్టుకోవడంతోపాటు, స్థలాలను గుర్తించి అధికారులకు ప్రతిపాదనలూ ఇచ్చామని వివరించారు. కానీ నేటికీ తమపార్టీతోపాటు, మిగతా రాజకీయ పార్టీలకూ స్థలాలు ఇవ్వలేదని తెలిపారు. ఇది ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యమేనని విమర్శించారు. జిల్లాల్లో తమ పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయించాలని కోరుతూ కలెక్టర్లకు ఇచ్చిన కాపీలు జత చేస్తూ 2019, జూన్ 24న ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖల ద్వారా తెలియజేశామని పేర్కొన్నారు. 14 నెలలైనా స్థలాలు కేటాయించకపోవడంతో మరోసారి 2020, ఆగస్టు 24న ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు అర్జీలు పెట్టుకున్నామని గుర్తు చేశారు. నేటికీ స్థలాల కేటాయింపు జరగలేదని తెలిపారు. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం అన్ని జిల్లాల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కేటాయించారని పేర్కొన్నారు. దీన్ని చూస్తే ఆ జీవో అధికార పార్టీ కోసమే తెచ్చినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఈ విషయంపై సీఎస్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకునీ, టీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన విధంగానే తమ పార్టీ జిల్లా కార్యాలయాలకూ తక్షణమే స్థలాలు కేటాయించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని కోరారు.