Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలలో నూతన పోలీసు భవనాల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలోని ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి పోలీసు శాఖ కృత నిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం వివిధ జిల్లాలలో పోలీసు నూతన భవనాల నిర్మాణాలపై పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ అధికారులతో పాటు, ఇతర సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల్లో నూతన పోలీసు భవనాలతో పాటు ఎస్పీలు, కమిషనర్ల కార్యాలయాల నిర్మాణాలపై నిశితంగా దృష్టిని సారించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా, పోలీసులకు అవసరమైన భవనాల నిర్మాణాల ద్వారా ప్రజలకు మరింతగా మెరుగైన సేవలను అందించగలమని చెప్పారు. జిల్లాల ఎస్పీల కార్యాలయాలు మొదలుకొని నూతన పోలీసు స్టేషన్ల భవనాల నిర్మాణాల వరకు ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో పోలీసు భవనాల నిర్మాణాలు దాదాపుగా పూర్తి కావచ్చాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఇదే స్థాయిలో ఇతర జిల్లాల్లోని భవన నిర్మాణాలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యంగా, నూతన పోలీసు స్టేషన్ల నిర్మాణాలతో పాటు వాటి సమీపంలోని ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు అవసరమైన ఇండ్లను కూడా నిర్మించే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మెన్ దామోదర్ గుప్తా, ఎండీ సంజరు జైన్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్, ఎస్పీ రాహుల్ హెగ్డేతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.