Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకపోగా పేదలు ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుంటే కూల్చివేయడం అత్యంత దారుణమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వరంగల్ పట్టణంలోని మట్టేవాడ శివారులోని 17 ఎకరాల్లో ఉన్న నిమ్మాయి చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి మట్టి నింపుకుని ఫ్లాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలైన ఎస్సీ,బీసీ, మైనార్టీలందరూ అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారని పేర్కొన్నారు. అనేక చోట్ల గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని వివరించారు. పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలకు 58 జీవో ద్వారా పట్టాలు ఇవ్వాలని కోరారు.