Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క చాన్స్ అంటుర్రు.. నమ్మొద్దు
- సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి 830కోట్లు కేటాయించాం
- పీపీపీ పద్ధతిలో ఆకర్షణీయ ప్రాంతంగా అభివృద్ధి
- చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
- ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలి: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- సాగర్‌లో బుద్ధవనం, అభివృద్ధి పనుల ప్రారంభం
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
''కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రైతులు, ఎడ్లు, వడ్లు తెల్వదు.. ఒక్క చాన్స్ ఇవ్వండని వస్తుర్రు.. దేశంలో చాలా ఏండ్లు పరిపాలించింది వారే.. అప్పుడేం చేయలేదు కానీ.. ఇప్పుడు ఇంకొక్క చాన్స్ ఇవ్వండని అడుగుతుండ్రు.. దయచేసి నమ్మొద్దు.. పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్ షిప్ మోడల్లో ఆకర్షణీయ స్థలంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను తీర్చిదిద్దుతాం.. దాంతో ఇక్కడి పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి'' అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.830కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామని తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో నిర్మించిన బుద్ధవనాన్ని శనివారం డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో పలు అభివద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
బుద్ధవనంలో, అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, హాలియా మున్సిపాలిటీల్లో సుమారు రూ.56కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. దాదాపు ఏడుసార్లు గెలిచి, మంత్రి పదవులు చేపట్టిన నాయకుల చేతకాని తనం వల్ల జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారీ ప్రజలను జీవచ్ఛవాలుగా చేసిందని తెలిపారు. ఆ సమస్యపై జాతీయ స్థాయిలో పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ అధికారంలోకి రాగానే మిషన్ భగరీథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత జలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దాయనకు ఏడు సార్లు అవకాశం ఇచ్చినా ఏం ఉద్ధరించలేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లది రైతు సంఘర్షణ సభ కాదు.. వాళ్లలో వాళ్లే తన్నుకునే సభలా నిలిచిందని విమర్శించారు. సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన హామీలను అన్నింటినీ నెరవేర్చారని తెలిపారు. రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు.
ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి
పరమత సహనం, ఇతర మతాలను గౌరవించడం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కషి చేసిన మల్లెపల్లి లక్ష్మయ్య, శివనాగిరెడ్డితో పాటు కూలీల నుంచి మొదలు పెడితే.. ఆకృతులను చెక్కిన శిల్పులు.. వందల మంది ఈ నిర్మాణంలో పని చేసి ఉంటారని, వారందరికీ మృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. 274 ఎకరాల్లో 90 ఎకరాలు మాత్రమే వినియోగిం చుకున్నామని, మిగతా స్థలాన్ని కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. చాకలిగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్‌లో ప్రపంచ పర్యాటక కేంద్రమైన బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ పనులు సాగుతున్నాయన్నారు. జిల్లాలో రూ.680 కోట్లతో లిఫ్ట్‌లు నిర్మిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అన్నారు.
ఈ కార్యక్రమాల్లో శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్లు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీందర్రావు, గాదరి కిషోర్‌కుమార్, రవీంద్రకుమార్, ఎన్.భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యేలు పూల రవీందర్, కూసుకుంట్ల రవీందర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్లు దూదిమెట్ల బాలరాజ్, సాయిచంద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.