Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎండాకాలం నాటికి 'సుంకిశాల'ను పూర్తి చేస్తాం
- ప్రాజెక్టు పనులకు కేటీఆర్ శంకుస్థాపన
నాగార్జునసాగర్ నుంచి రత్నాకర్
''సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి తాగు నీటి సరఫరా సులభమవుతుంది.. భవిష్యత్లో ఎంతటి కరువొచ్చినా తాగునీటి కొరత రాదు'' అని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్ సిటీకి వాటర్ సప్లరు చేసేందుకుగాను నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ సమీపంలో రూ.1,450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇన్టెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 50 ఏండ్ల ముందు చూపుతో సుంకిశాల ప్రాజెక్టును చేపట్టామని, రాబోయే ఎండాకాలం నాటికి దీనిని పూర్తి చేస్తామని తెలిపారు. సుంకిశాల పూర్తయితే చాలా మేలు జరుగుతుందని, వరుసగా ఐదేండ్లు కరువొచ్చినా హైదరాబాద్ ప్రజలు తాగునీటికి తండ్లాడే పరిస్థితి లేకుండా ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం వేసవిలో నగరానికి కృష్ణా నీటిని తరలించేందుకు ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వస్తుండటంతో ఇందుకోసం ఐదారుకోట్లు ఖర్చవుతోందని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అలాంటి పరిస్థితి పోతుందని, తాగునీటికే కాకుండా అవసరమైతే పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5 కోసం కూడా ఇప్పుడే సివిల్ వర్కులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 37 టీఎంసీల నీరు అవసరమవుతోందని, 2072 నాటికి 71 టీఎంసీల నీరు అవసరం పడుతుందని అంచనా వేశామన్నారు. సుంకిశాలతో పాటు కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ నగరానికి మొత్తం 60 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందన్నారు. నగరానికి నీరు చేర్చే వ్యవస్థలో ఒక చోట ఆటంకం ఏర్పడినా, నీటి సరఫరా విషయంలో ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. దేశంలోని మహానగరాల్లో నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్య, కాలుష్య సమస్య ఉన్నాయని, ఇలాంటి సమస్యలు హైదరాబాద్కు రావొద్దనే ఆలోచనతోనే ఎంతో ముందు చూపు, దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు.