Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాన్లీ మహిళా కాలేజీ స్నాతకోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సాంకేతిక విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ పదో స్నాతకోత్సవం, వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అమ్మాయిలు అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యలో కొత్త కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలనీ, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఈ స్నాతకోత్సవంలో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 600 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఓయూ వీసీ డి రవీందర్, రిజిస్ట్రార్ పి లక్ష్మినారాయణ, పరీక్షల నియంత్రణాధికారి బి శ్రీగణేష్, మెథడిస్ట్ చర్చ్ చైర్మెన్ బిషప్ ఎంఏ డేనియల్, స్టాన్లీ కాలేజీ కార్యదర్శి, కరస్పాండెంట్ కె కృష్ణారావు, యాజమాన్య ప్రతినిధులు రాకేష్, ప్రదీప్‌రెడ్డి, డీన్ అకడమిక్స్ ఎ వినయబాబు, ప్రిన్సిపాల్ సత్యప్రసాద్ లంక, డైరెక్టర్ వి అనురాధ, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.