Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర నేతలు
నవతెలంగాణ- పానగల్
భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలని, నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరవిపాకులలో 'పాలమూరు రంగారెడ్డి' ప్రాజెక్టు ముంపు బాధితులు ఆరు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. గ్రామ ముంపు బాధితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని తెలిపారు. బండరవిపాకుల గ్రామం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముంపునకు గురైందన్నారు. మరోచోట గ్రామాన్ని నిర్మించి, వారికి పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు, కాల్వల నిర్మాణం చేయాలని చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం పరిహారం ఇస్తామనడం సరైందని కాదన్నారు.
ఇప్పటికైనా ఇంటి స్థలాలు, నిర్మాణానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూనిర్వాసితులకు అండగా పోరాటం చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే స్పందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్యా నాయక్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పరమేశ్వరచారి, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, మాజీ సర్పంచ్ బాలస్వామి, మిద్దె రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.