Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ హత్యారాజకీయాలు మొదలు పెట్టారు
- కమీషన్లు వచ్చే ప్రాజెక్టుల్నే ఆయన కడుతున్నారు
- కేంద్ర పథకాలకు పేర్లుమార్చి ప్రచారం చేసుకుంటున్నారు
- మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం...
- నా జీవితంలో ఇంతటి అవినీతి సర్కారును చూడలేదు : కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిజాం సర్కారును గద్దె దింపేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నదనీ, దాని నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హత్యా రాజకీయాలు మొదలు పెట్టారనీ, రాష్ట్రాన్ని మరో బెంగాల్‌గా మారుస్తున్నారంటూ బీజేపీ కార్యకర్త సాయిగణేష్ మరణాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్‌షా మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి, తండ్రీ కొడుకులు (కేసీఆర్-కేటీఆర్) ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని చూడలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఒక్కరికీ చేయలేదన్నారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, దళితబంధు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని హామీ ఇచ్చారనీ, అవి ఎక్కడున్నాయని అడిగారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారనీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే పరిస్థితులను దిగజార్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వశిక్షా అభియాన్ కింద నిధులిస్తే, దానికే 'మన ఊరు-మనబడి' అని పేరుమార్చుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందనీ, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలపై ఫామ్‌హౌజ్‌లో ఎన్నిరోజులు ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. తాము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నామనీ, రేపే ఎన్నికలు నిర్వహించినా, రాష్ట్రంలో బీజేపీ గెలుపును నిలువరించలేరని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలపొద్దన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రైతుల నుంచి బాయిల్డ్‌రైస్ కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు కోత పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 2.50 లక్షల కోట్లను తెలంగాణ అభివద్ధి కోసం ఇచ్చామనీ, ఆ వివరాలన్నీ సీఎం కేసీఆర్‌కు పంపుతామన్నారు. అంతకు ముందు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, రాజాసింగ్, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు.
బీజేపీ సభలో గద్దర్
ప్రజాగాయకుడు గద్దర్ అనూహ్యంగా బీజేపీ బహిరంగ సభాస్థలిలో కనిపించారు. దీనిపై ఆయన్ని విలేకరులు వివరణ అడగ్గా, బెంగుళూరు కుట్ర కేసును ఎత్తేయాలని కోరుతూ కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానని చెప్పారు. అయితే భద్రతా కారణాల రీత్యా గద్దర్‌ను వేదికపైకి పోలీసులు అనుమతించలేదు.