Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే భూస్వాములు, పెద్దల నుంచి తీసుకోవాలి
- : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- నారాయణపేట రూరల్
పేదలు సాగు చేసుకుంటున్న భూములను పేదలకే దక్కాలని, కంపెనీలకు కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో శనివారం రైతుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు.
సాగులో ఉన్న 650 ఎకరాల భూమిపై పేద రైతులకు యాజమాన్యం హక్పు కల్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీలకు పేదల భూములను ఇవ్వడం కాదని.. దమ్ముంటే భూస్వాములు, పెద్దల వద్ద ఉన్న వందల ఎకరాలు తీసుకుని ఇవ్వాలని చెప్పారు. 200 వందల ఎకరాలపై మాత్రమే రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఈనెల 9వ తేదీన పేట బహిరంగ సభలో కేటీఆర్‌తో చెప్పించడం సరైంది కాదన్నారు. కంపెనీలకు 800 వందల ఎకరాల భూమి ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడం అన్యాయమన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఆ భూమి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న పేదల నుంచి లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సీపీఐ(ఎం) ఎర్ర జెండా అండగా ఉంటుందని, భూములపై హక్కులు కల్పించేవరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు.
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు మాట్లాడుతూ.. ప్రజలను ప్రలోభపెట్టి సాగుచేసుకుంటున్న భూములను లాక్కుంటే సహించేది లేదన్నారు. 650 ఎకరాల్లో నుంచి సెంటు భూమిని కూడా వదులుకోవడానికి రైతులు సిద్ధంగా లేరని చెప్పారు. బేషరతుగా 650 ఎకరాల భూమికి పట్టా పాస్ బుక్కులు ఇచ్చి.. రైతులకు రైతు బీమా, రైతుబంధు, బ్యాంకు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నారాయణపేట జిల్లా కార్యదర్శి జి వెంకట్రాంరెడ్డి, నాయకులు అంజిలయ్య గౌడ్, బలరాం, శివకుమార్, దస్తప్ప, మహమ్మద్ అలీ, డి.కృష్ణయ్య, మల్లేష్, గోవింద్, భూ సాధన నాయకులు భాస్కర్, నర్సింలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.