Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి నుంచి తప్పనిసరి చేసిన కేంద్రం
- గ్రామాల్లో సిగల్స్ అంతంతే.. అప్లోడ్ చేసేదెట్టా?
- అయోమయంలో మేట్లు, ఉపాధి కూలీలు
- చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగమేనంటున్న సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీల హాజరును సోమవారం నుంచి కచ్చితంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎమ్ఎమ్ఎస్) యాప్ ద్వారానే నమోదు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇదే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులకు సర్క్యూలర్ పంపారు. గ్రామాల్లో సెల్‌ఫోన్‌కు సిగల్స్ రావడమే పెద్ద కష్టం..అలాంటిది మేట్లు ప్రతిరోజూ ఆన్లైన్లో హాజరును నమోదుచేయడం కత్తిమీద సామే. దీంతో కూలీలు తమ హాజరు నమోదుపై ఆయోమయానికి గురవున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసిన చోట్ల అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. కేంద్రం నిర్ణయం రాష్ట్రంలోని ఉపాధి కూలీల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకించకుండా అమలుకు సిద్ధపడటం ఆందోళనకరం. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే తెరపైకి తెచ్చిన ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
'రాష్ట్రంలో సోమవారం నుంచి 20 లేదా అంత కంటే ఎక్కువ మంది కూలీలకు మస్టర్ రోల్స్ జారీ చేసిన అన్ని వర్క్సైట్లలో అటెండెన్స్ ఎన్ఎమ్ఎమ్ఎస్ యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలి. అన్ని గ్రామ పంచాయతీల్లో వంద శాతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మేట్లదే' అని కేంద్రం తేల్చింది. దీంతో మేట్లను సరిపోను స్థాయిలో రిజిస్టర్ చేయించుకోని గ్రామపంచాయతీ వెంటనే ఆ పనిని పూర్తిచేయాలనీ, కొత్తగా తీసుకున్న మేట్లకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. హాజరు నమోదు చేయడంలో ఏమైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలనీ, కానిపక్షంలో స్క్రీన్‌షాట్‌తో పాటు పూర్తి వివరాలు పంపాలని సూచించింది. వివిధ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఎన్ఎమ్ఎమ్ యాప్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని సర్కారు చెబుతున్నది. యాప్ ద్వారా క్యాప్చర్ చేయడంలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్‌వేర్‌లో మాన్యూవల్‌గా అటెండెన్స్ సదుపాయం డీపీసీ లాగిన్‌లో ఇస్తామనీ, అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే అది కూడా కేస్ టూ కేస్ అబ్జర్వేషన్ ఆధారంగా మాన్యువల్ ఎంట్రీ అవకాశముంటుందని స్పష్టం చేసింది.
కేేంద్రం చెప్పేది ఒకలా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా..
ఉపాధి హామీ పనుల్లో అవినీతిని అరికట్టడంలో భాగంగా పారదర్శకత, జవాబుదారీ తనం కోసం ఇలా చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఎన్ఎమ్ఎమ్ఎస్ వాడకం మేట్లకు ఇబ్బందికరంగా మారింది. పనిప్రదేశం నుంచే ఎన్ఎమ్ఎమ్ఎస్ యాప్‌లో కూలీల హాజరును నమోదుచేయాలి. మొబైల్ యాప్‌పై తమకు కనీస శిక్షణ ఇవ్వలేదని మేట్లు వాపోతున్నారు. ఉపాధి హామీ పనుల్లో పనిచేసేవారిలో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులే. సీనియర్లే మేట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు, యాప్‌ల మీద వారికి అవగాహన అంతంతే. మొబైల్లో ఒక్కొక్క మస్టర్ పూర్తిచేయడానికి పనిప్రదేశంలో నాలుగైదు సార్లు యాప్‌ను ఓపెన్‌చేయడం, ఫొటోలు తీయడం, అప్లోడ్ చేయడం మేట్లకు కత్తిమీద సామే. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మరీ ఇబ్బందికరంగా మారే ప్రమాదముంది. 'మస్తు ఇబ్బంది అయితుంది సార్. అసిఫాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతం మాది. ఇప్పుడే కొండలు, గుట్టలల్లో సిగల్ రాక చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సైటేమో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్ల సాయంత్రం మూడు గంటలకు ఓపెన్ అయి ఏడు గంటల వరకే పనిచేస్తున్నది. ఆ టైమ్‌లోనే అప్లోడ్ చేయడం ఒక సమస్యగా మారింది. రోజూ అందులోనే అప్లోడ్ చేయడమంటే కష్టమే' అంటూ ఓ మేట్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒక్కొక్క మస్టర్ పూర్తి చేయడానికి ఐదారు సార్లు ఓపెన్ చేయాల్సి వస్తున్నది. చదువుకున్న నాకే రాష్ట్రంపేరు, జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు, జాబ్‌కార్డు నెంబర్ల ఎంట్రీ చేయడానికి సిగల్ సరిగా వస్తేనే పది నుంచి పదిహేను నిమిషాలు పడుతున్నది. సిగల్ రాకపోతే ఇక అంతే' అని వరంగల్ జిల్లాకు చెందిన మరో మేట్ వాపోయాడు. గ్రామాల్లో సిగల్, సర్వర్ డౌన్ సమస్యలు సర్వసాధారణం.కంప్యూటర్ నెట్ సెంటర్లల్లో నెట్ వచ్చేదే అంతంత. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీల హాజరును ఎన్ఎమ్ఎస్ఎస్ యాప్ ద్వారా చేపట్టడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని తరుణంలో ఈ భారం గ్రామ కార్యదర్శులపై పడే అవకాశం ఉంది. ఈ పద్ధతిలో హాజరు తీసుకోవడం ద్వారా కూలీలకు అకౌంట్లలో నేరుగా పైసలేస్తమని కేంద్ర ప్రభుత్వం బూచీ చూపెడుతున్నది. వాస్తవానికి బ్యాంకు అకౌంట్లలకు, జాబ్‌కార్డు నెంబర్లకు మధ్య అనుసంధానమే లేదు. అలాంటప్పుడు నేరుగా పైసలు ఎలా వేస్తారనే చర్చ నడుస్తున్నది. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసే వాళ్ల పేరు జాబ్‌కార్డుల్లో ఒకలా, బ్యాంక్ అకౌంట్లలో మరోలా చాలా వరకు ఉన్నాయి. ఇది కూడా ఒక సమస్యగా మారే అవకాశం ఉంది.
ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికే ఈ యాప్ : బుర్రి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
అధికారులకే ఆ యాప్‌లో ఎంట్రీపై సరైన అవగాహన లేదు. ఇగ, క్షేత్రస్థాయిలో మేట్లు ఎలా ఎంట్రీ చేస్తారు? కూలీలు మండుటెండలో పనిచేసినా సిగల్స్ రాకపోతే వారి రెక్కల కష్టం బూడిలో పోసిన పన్నీరే అవుతుంది. కూలి నష్టపోయే ప్రమాదం ఉంది. పనిచేస్తున్నట్టు ఫొటోలు తీసి రోజూ రెండు సార్లు అప్లోడ్ చేయడమంటే కూలీలను అవమానించడమే. ఇది ముమ్మాటికీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా అమలు చేస్తున్నదే. అసలు కొలతలు వేయడమే చట్టరీత్యా నేరం. మళ్లీ ఈ ఆన్లైన్ హాజరు గొడవేంటి? ఆండ్రాయిడ్ ఫోన్లు లేని మేట్లకు ఎవరు కోనిస్తారనే దానిపైనా, నెలకు 300-400 పెట్టి ఎవరు రీచార్జి చేయిస్తారనే దానిపైనా స్పష్టతేదీ? కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే ఒక్కో గ్రామంలో 10 నుంచి 15 వారాల డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తాం.