Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాస్ ధరల పెంపుకు నిరసన
- మంత్రి సబితా ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో మహాధర్నా
- మహిళలతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోతారు అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్
నవతెలంగాణ-మీర్పేట్
మహిళలతో పెట్టుకుంటే మట్టిలో కలిసిపోతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా ఆదివారం హైదరాబాద్‌లోని మీర్పేట్, బడంగ్పేట్ టీఆర్ఎస్ కమిటీల ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నేతృత్వంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రెండు కిలోమీటర్లకుపైగా వేలాది మందితో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టకుండా తెలంగాణను మరింత దోచుకునేందుకు అధికారం కోసం బీజేపీ నేతలు తహతహలాడుతున్నారని విమర్శించారు. మహిళలతో పెట్టుకున్న వారు బాగుపడినట్టు చరిత్రలో లేదని, కేంద్ర ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7289 కోట్లతో 'మన ఊరు-మన బడి' లాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే రూ.500 కోట్లు కూడా రాని సర్వ శిక్ష అభియాన్ నిధులు అంటూ అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకం లేదని మంత్రి ప్రశ్నించారు. హరితహారం, శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు వారి పథకాలే అని చెప్పుకున్న బీజేపీ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవో చెప్పాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డికి ఒక్క పైసా ఇవ్వకుండా, జాతీయ హోదా ఇవ్వకుండా, ఐటీఐఆర్ రద్దు చేసి, విభజన హామీలు మరచిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. గ్యాస్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచుతున్న కేంద్ర సర్కార్‌ను నిలదీస్తారని అమిత్ షా మీటింగ్‌లో మహిళలు కనిపించలేదని ఆరోపించారు.
ఖాళీ సిలిండర్లతో, కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. 'మోడీ గ్యాస్ ధరలను తగ్గించండి..' 'మోడీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి..' అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో సభ అంతా 'షేమ్.. షేమ్..' అంటూ నినాదాలతో దద్దరిల్లింది. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనిత రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీధర్, టీఆర్ఎస్ యువనేత కార్తీక్ రెడ్డి, మీర్పేట్, బడంగ్ పేట్ మేయర్లు దుర్గా దీప్లాల్ చౌవాన్, చిగిరింత పారిజాత నరసింహ్మ రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, రామిడి రాంరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేష్ గౌడ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.