Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డికి రైతుసంఘం, వ్యకాస వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వారు వినతిపత్రం సమర్పించారు. గత ఆరు రోజులుగా నిర్వాసితులు చేస్తున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపారు. ఏడేండ్లుగా 987 మంది నిర్వాసితులకు ఏడేండ్లుగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. 97 మందికి ఎస్ఇఎస్ సర్వేలో పేర్లు రాలేదని తెలిపారు. 18 ఏండ్లు పూర్తయిన యువతీ, యువకులను కుటుంబంగా గుర్తించలేదనీ, దీంతో ఆయా కుటుంబాలు నష్టపోయే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానం వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్లో రోడ్లు, విద్యుత్తు, స్కూల్, డ్రైనేజి ఏర్పాటు చేయలేదని తెలిపారు. 460 మందికి ఇండ్ల స్థలాలు కేటాయించారనీ, మిగతా వారికి స్థలాలు చూపించలేదని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడంతో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కూలీలకు 1000 పని దినాలకు డబ్బులు చెల్లించాలనీ, వృత్తిదారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి, ప్లాటుకు మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా నల్లా కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన వారిలో కొంత మందికి డబ్బులు ఇవ్వలేదనీ, వెంటనే చెల్లించాలని వారు కోరారు.