Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలి
- గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన రాంపూర్ రైతులు
నవతెలంగాణ-కాజీపేట
రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ల్యాండ్ పూలింగ్ జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న తెలిపారు. హన్మకొండ జిల్లా కాజిపేట మండలం రాంపూర్‌లో ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులు పంటలు పండించే వ్యవసాయ భూములను ఎలాంటి అనుమతులు లేకుండా లాక్కోవడం చూడటాన్ని నిరసిస్తూ రాంపూర్ గ్రామ బొడ్రాయి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచించడం కోసం జీవో 80ఏ తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ పేరుతో అక్రమంగా వ్యవసాయ భూములు లాక్కోవాలని చూడటాన్ని రైతులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు. 27 గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, 1, 2 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, వంటి పంటలు పండించి జీవనం గడుపుతూ కుటుంబ పోషణ సాగిస్తున్నారని తెలిపారు.
27 గ్రామాల్లో 22 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యక్షంగా 15 వేల మంది రైతులు నష్టపోవడంతో పాటు 50 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు హనుమంత రావు, నాయకులు అదిరెడ్డి, నాయిని రాంచందర్, వేల్పుల సదా నందం, నాయిని ఎల్లయ్య, రోగ బోయిన సంపత్, ఐలయ్య, మహిపాల్ రెడ్డి, నాయిని రజిత, సుజాత, యాదమ్మ, నల్ల లక్ష్మీ, శ్రావణి, పద్మ, రోకం డ్ల రజిత, కొత్తపెళ్లి స్వరూప, శంకరమ్మ , సంజీవరెడ్డి, రవి, సంపత్, యాదకుమార్, తదితరులు పాల్గొన్నారు.