Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ
నవతెలంగాణ-కల్చరల్
నాగరికత పరిణామ క్రమంలో వివిధ చేతివృత్తుల ఆవిర్భావం ప్రపంచవ్యాప్తంగా శ్రమ విభజనగా జరిగిందని, కానీ భారతదేశంలో అది కులవ్యవస్థకు దారి తీసిందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. భారతదేశంలో శ్రమ శక్తులను చులకనగా చూడటం వల్ల కుల వ్యవస్థకు దారి తీసిందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో.. బహుళ అంతర్జాల మహిళ పత్రిక నిర్వహణ, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జ్వలిత సంపాదకీయంలో మల్లెసాల (శతాధిక చేతి వత్తుల కథలు), సంఘటిత (స్త్రీవాద కవిత్వం) అవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లడుతూ.. మార్క్స్ శ్రమ విభజనలో దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారని, కానీ భారత పరిస్థితులు దోపిడీ కాకుండా చేతి వృత్తులవారు కులపరంగా వివక్షత, ఉన్నత వర్గాల దురహంకారానికి గురికాబడుతున్నారన్నారు. ఉత్పత్తి కులాలు సంఘటితంగా నిలిచి హక్కుల కోసం పోరాడేందుకు మల్లెసాలలోని కథలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ.. సంపాదకురాలు జ్వలిత కృషికి జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించాలని ప్రశంసించారు. వ్యవసాయం, పురోహిత్యం వంటివి వృత్తులేనని, కానీ అధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించటం తప్పని సరన్నారు. రాష్ట్ర స్త్రీ సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత సంఘటిత గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. స్త్రీ భావనలు కవితల్లో వ్యక్తమైనాయని వివరించారు. సాహితీవేత్త డాక్టర్ రఘు అధ్యక్షత వహించిన సభలో మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి, రచయిత్రి గోగు శ్యామల, సాహితీవేత్త డాక్టర్ బి.ఎస్.రాములు, డాక్టర్ దేవకీ దేవి, ఎస్.శ్రీనివాస్, డాక్టర్ నాలేస్వరం శంకరం తదితరులు పాల్గొనగా తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నస్రీన్ ఖాన్ సభకు స్వాగతం పలికారు.