Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది చైతన్య తెలంగాణ అని గుర్తుపెట్టుకోండి
- రాష్ట్రానికి పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదు
- కార్పొరేట్ల చేతిలో బీజేపీ స్టీరింగ్
- ఆ పార్టీ నేతలు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు
- అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన సభ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా... ఇక్కడకు వచ్చి షో చేసి పోయారని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన షోలు ఇక్కడ పని చేయబోవని చురకలంటించారు. 'ఇది చైతన్యవంతమైన తెలంగాణ సమాజమనే విషయాన్ని గుర్తుంచుకోండి...' అంటూ హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపైనా, అమిత్ షాపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ స్టీరింగ్ కార్పొరేట్ కంపెనీల చేతిలో ఉందనీ, ఆయా కంపెనీలు చెప్పినట్టే కేంద్రం నడుచుకుంటున్నదని విమర్శించారు. తుక్కుగూడ సభలో అమిత్ షా పచ్చి అబద్దాలు వల్లె వేశారని అన్నారు. ఆయన అమిత్ షా కాదు..అబద్దాల షా అని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ (బీజేపీ పాలిత) రాష్ట్రాల గురించి పదే పదే చెబుతున్నారు... కానీ ఆ డబుల్ ఇంజిన్ రాష్ట్రాల్లో విద్యుత్ లేదు, మంచినీరు లేదని గుర్తు చేశారు. గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చారని తెలిపారు.
అక్కడ ఐదు నెలల్లో నాలుగు సార్లు విద్యుత్ఛార్జీలను పెంచారని వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచటం ద్వారా దేశంలోని సామాన్యుల వద్ద నుంచి ప్రధాని మోడీ రూ.26.50లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. ఆయన మిత్రులకు మాత్రం రూ.11లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. రైతుబంధు ఎప్పుడొచ్చింది? పీఎం కిసాన్ ఎప్పుడొచ్చింది? ఆ పథకం కింద కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే గ్యాస్ సిలిండర్ ధర అధికంగా ఉండే దేశం భారత్ కాదా...? అని నిలదీశారు. దేశంలో గత 30 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందనీ, ఈ క్రమంలో భారత్ మరో శ్రీలంక కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం ద్వారా రిజర్వేషన్లకు శఠగోపం పెడుతున్న బీజేపీ... ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 8.50లక్షల ఖాళీలున్నాయంటూ స్వయంగా కేంద్ర మంత్రే చెప్పారని గుర్తు చేశారు. 60 ఏండ్లలో అనేక మంది ప్రధానులు చేసిన అప్పులను.. మోడీ కేవలం ఎనిమిదేండ్లలోనే చేశారని తెలిపారు.
బహిరంగ సభలో అమిత్షా చేసిన విమర్శలను కేటీఆర్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ఆయన ప్రసంగం... ఇనప డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపితే వచ్చే సౌండ్లాగా ఉంది తప్ప తెలంగాణకు పనికొచ్చే మాట ఒక్కటీ చెప్పలేదని ఎద్దేవా చేశారు. తుక్కుగూడలో చెప్పిన తుప్పు మాటలను విశ్వసించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నిజానికి బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదనీ.. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తే 108 చోట్ల ఆపార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పారు. 'సీఎం పదవి కావాలంటే రూ.2,500 కోట్లు ఇవ్వాలంటూ బీజేపీ అధిష్ఠానం తనను అడిగిందని కర్ణాటకలోని విజయపుర ప్రాంతానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే పాటిల్ యాత్నాల్ చెప్పారు. ఈ విషయం నేను చెబుతోంది కాదు. పత్రికల్లో కూడా వచ్చింది. ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీజేపీ ఖండించలేదు.. అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతవరకు ఆయన్ను సస్పెండ్ చేయలేదు. వాళ్లు పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, నీతిహీనులు. కర్ణాటకలో 30 శాతం కమిషన్ ఇవ్వనిదే ఎండోమెంట్ నిధులు కూడా రావంటూ ఓ హిందూ మఠాధిపతి చెప్పారు. 40 శాతం కమిషన్లు ఇస్తే తప్ప బిల్లులు రావటం లేదంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుగా వినేవాళ్లు ఏమనుకుంటున్నారోననే సోయి కూడా లేకుండా నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పి ఏదో షో చేసి పోతామంటే కుదరదు. ఇది చైతన్యవంతమైన తెలంగాణ...' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండంటూ అమిత్షా మేం కోరాం. వాటి గురించి నిజాలు చెప్పమంటే ఆయన నిజాం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్లు తలచుకున్నంతగా నిజాంను ఆయన వారసులు కూడా తలచుకోరేమో! మాట్లాడితే నిజాం, రజాకార్లు.. ఇవి తప్ప తెలంగాణకు పనికొచ్చే ముచ్చట ఒక్కటైనా చెప్పారా?తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3.65లక్షల కోట్లు చెల్లిస్తే.. తిరిగి వచ్చింది కేవలం రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చినట్టే తెలంగాణకు కూడా ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు...' అని కేటీఆర్ వివరించారు.