Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు తీసుకుని నిర్ధారించాలి
- పూట్ఖరాబ్ జాబితాలో చేర్చాలి
- వాటి వివరాలు ధరణి, పాస్ పుస్తకాల్లో పొందుపర్చాలి
- ఆర్డీఓలకు రాష్ట్ర సర్కారు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామాల్లో వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్న భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? అవి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? తదితరాంశాలను గుర్తించి ధరణిలో, పట్టాదారుపాసుపుస్తకాల్లో 'పూట్ ఖరాబ్' జాబితాలో చేర్చాలని రాష్ట్ర సర్కారు ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1954-55లో శేత్వారీ రికార్డు రూపొందించిన సమయంలో వ్యవసాయానికి వినియోగించని భూములను రికార్డుల్లో పూట్ ఖరాబు, పోరంబోకు, బంచరాయి భూములుగా నమోదు చేశారు. ఆ తర్వాతి కాలంలో నీటి వసతి పెరిగాక చాలా మంది రైతులు వాటిని సాగులోకి తీసుకొచ్చారు. నేటికీ చాలా చోట్ల సాగులోకి తీసుకురాని భూములున్నాయి. ఈ పూటు ఖరాబు జాబితాలో పశువుల మేతకు వదిలివేయబడ్డ భూములు, పశువుల షెడ్లు, హెరిక్స్, పేడగుంటలు, భవనాలు, సాగుభూమిలోని నిర్మాణాలు, రాళ్లు, ట్యాంకులు, ఉప-విలీన ప్రాంతం, కట్టలు, నీటిపారుదల ద్వారా కప్పబడిన భూములు, ఛానెల్, వాగులు, వర్రెలు, ప్రయివేటు ఫారెస్ట్‌తో కూడిన భూములు, ట్రాక్టర్ షెడ్లు, పంటనూర్పిడి ప్రాంతాలు, వరదలు, కోతలకు గురై సాగులో లేని భూములు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు ఉపయోగించే భూములు, ట్రాక్టర్, హార్వెస్టర్ మార్గాలు వస్తాయి. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే అవి నమోదయ్యాయి. ఇలాంటి భూములను గుర్తించే పనిలో రాష్ట్ర సర్కారు పడింది. అలాంటి భూమి ఎంత మేర విస్తీర్ణాన్ని కలిగి ఉందనే వివరాలను రికార్డులలో పొందుపరచాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. రెవెన్యూ రికార్డులలో 'పూట్ ఖరాబ్' వివరాలను పొందుపరచడానికి ఏయే పద్ధతులను అనుసరించాలనే దానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను కూడా జారీ చేసింది. పట్టాదారుడు సంబం ధింత రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)కు తనకు పూట్ ఖరాబ్ భూమి ఉందని దరఖాస్తు చేసుకోవాలి. అందులో అతను తన పాస్‌బుక్, భూమి వివరాలను పొందుపర్చి అప్లికేషన్లో 'పాట్ ఖరాబ్'గా క్లెయిమ్ చేసిన పరిధి, దాని ఉపయోగం స్పష్టంగా పేర్కొనాలి. ఆర్డీఓ ఆ భూమికి సంబంధించిన సర్వే, సరిహద్దులను క్షేత్రస్థాయి విచారణ జరిపించి నిర్ధారిస్తారు. విచారణ ఆధారంగా పూట్ ఖరాబ్ ప్రాంతంగా గుర్తిస్తే ప్రొసీడింగ్స్‌ను జారీ చేస్తారు. ఆ తర్వాత వివరాలు రికార్డులో నమోదుచేస్తారు. వాటిని పట్టాదారు పాసుపుస్తకాలలో, ధరణి వెబ్సైట్లో పొందుపరుస్తారు.