Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- మే 20 లోపు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు
- సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఎమ్‌డీకి వినతిపత్రమివ్వాలి
- సీఐటీయూ రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం వేధింపులను ఆపాలనీ, పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఐటీయూ రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. పెంచిన బస్‌చార్జీలను తగ్గించాలని కోరింది. డొక్కు బస్సులిచ్చి మైలేజ్ తీసుకురావాలని ఉద్యోగులను వేధించొద్దని విన్నవించింది. ఈ సమస్యలన్నింటిపైనా మే 20 లోపు అన్ని జిల్లాల్లోనూ రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిం చాలని పిలుపునిచ్చింది. ఆ తర్వాత సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఎమ్‌డీకి వినతిపత్రం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అప్పటికీ యాజమాన్యం సరిగ్గా స్పందించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెకు ఊపు తేవడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమైనదన్నారు. స్వరాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన వారిని రాష్ట్ర సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదని సూచించారు. రెండు వేతన ఒప్పందాలను, ఐదు డీఎలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని విమర్శించారు. పైగా, ఆత్మహత్యలు చేసుకునేలా, ఉద్యోగం విడిచిపోయేలా ఉన్నతాధికారులు వేధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్న కార్మికులపై భారాలు మోపడం తగదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ ఆర్టీసిలో ఉన్న 6500 బస్సుల్లో 4వేలకు పైగా కాలం చెల్లినవేననీ, వాటితో కేఎంపీఎల్ ఎలా పెంచగలుగుతారని ప్రశ్నించారు. డ్రైవర్లకు మెమోలు, చార్జీషీట్లు ఇవ్వడమే కాక, నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిన ఆయిల్ విలువను డ్రైవర్ల నుంచి రికవరీ చేయడం అన్యాయమన్నారు. కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, రాష్ట్ర సర్కారు, ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న రూ. 1400 కోట్ల పీఎఫ్ డబ్బులు, 990 కోట్లు సీసీఎస్ డబ్బులు ఆయా ట్రస్ట్‌లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐయూటీసీ రాష్ట్ర కార్యదర్శి నర్సింహ్మ మాట్లాడుతూ..ఆర్టీసీ ప్రజారవాణా వ్యవస్థ అనీ, ఆ సంస్థలో లాభనష్టాలను బేరీజు వేసుకోవడం సరికాదని సూచించారు. ఆర్టీసీకి రాయితీలివ్వకుండా, ఇవ్వాల్సిన నిధులివ్వకుండా నష్టాల్లో ఉందని చూపెట్టడం దారుణమన్నారు. ప్రతి సంస్థలోనూ ఉద్యోగులను భయపెట్టి పనిచేయించటం టీఆర్ఎస్ సర్కారుకు ఒక తంతుగా మారిందని విమర్శించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి విజరుకుమార్ మాట్లాడుతూ.. కార్మిక సంఘాలను ఆర్టీసీ సంస్థలో లేకుండా చేయడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. కార్మికులు తమ సమస్యలపై బయటకొచ్చి పోరాటాలు చేయలేని పరిస్థితిని కేసీఆర్ సర్కారు కల్పించిందని విమర్శించారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరప్రసాద్ మాట్లాడుతూ..రూ.85 వేల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీ సంస్థను నడపడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు. సంస్థను కాపాడుకునేందుకు ప్రభుత్వంపై పోరాడేలా క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై ఉందన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ.. డీజిల్ రేట్ల పెరుగుదలను అడ్డం పెట్టుకుని ఆర్టీసీని ప్రయివేటుపరం చేసే కుట్ర జరుగుతున్నదనీ, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం అందరిపైనా ఉందని చెప్పారు. ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు రాజేందర్ మాట్లాడుతూ..రైతులు పండించే కూరగాయలు, ఇతర పంటలను రోజూ మార్కెట్‌కు తరలించే బస్సులను కూడా లాభాలు రావడం లేదనే సాకుతో తీసేయడం దారుణమని విమర్శించారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌రావు, తెలంగాణ కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.యాదగిరి మాట్లాడుతూ..ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు ఒక్క కార్మికుల సమస్యగానే కాకుండా ప్రజల సమస్యగా చూడాలని కోరారు. ప్రజారవాణా వ్యవస్థను బతికించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని గుర్తుచేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.ధర్మానాయక్, ట్రాన్స్‌పోర్టు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శ్రీకాంత్, హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రవీందర్‌రెడ్డి, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, తదితరులు మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.