Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో లబ్దిదారుల ఆందోళన
- యూనిట్ల మంజూరు ప్రక్రియలో ఆలస్యం
- హార్వెస్టర్లు, జేసీబీల కొనుగోలుకు అంగీకరింపజేస్తున్న అధికారులు
- హర్యానా గేదెలు సెట్ కావంటున్న లబ్దిదారులు
- చింతకాని మండలంలో నత్తనడకన గ్రౌండింగ్
ఎస్. వెంకన్న
దళితబంధు.. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరిస్తామని సీఎం ప్రకటించారు. 2021 ఆగస్టు 16న ఆ నియోజకవర్గంలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం అమలు ఆశించిన మేరకు వేగంగా అమలు కావడం లేదనే అభిప్రాయం దళిత సమాజంలో వ్యక్తమవుతున్నది.దళిత బంధు కోసం రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఏడునెల్లు కావొస్తున్నా ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితా పూర్తి కాలేదు. ఆయా మండలాలకు కలిపి రూ.250 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు అనుకున్న మేరకు పని కావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు మండలాలను మినహాయించి ఆయా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక మాత్రం వేగంగా పూర్తవుతున్నది. దీంతో తమకు లబ్ధి ఎప్పుడు కల్పిస్తారోనని పైలెట్ మండలాల్లోని లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'నవతెలంగాణ' ఖమ్మం జిల్లా చింతకానిలో పర్యటించిన సందర్భంగా దళిత బంధుకు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి.
ఏడు నెలలు.. 25శాతం..
గతేడాది ఆగస్టు 16న హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటిన రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, మండలాలను పైలట్ మండలాలుగా ఎంపికచేశారు. ఇందులో చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా మూడు మండలాల్లో ఒక్కో దానికి రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇదంతా జరిగి ఏడు నెల్లవుతున్నా పథకం అమలు మాత్రం నత్తనడకన సాగుతున్నది. ప్రకటనలు, ప్రచారం బాగా జరుగుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో 25శాతం కూడా అమలు కాలేదు.
లెక్కలు సరే..గ్రౌండింగ్లోనే జాప్యం..
ప్రభుత్వం పైలట్ మండలాల ప్రకటన చేయగానే ఆయా జిల్లాల అధికార యంత్రాంగం మండలాల్లో ఎస్సీ కుటుంబాల లెక్కలు తీశారు. అయితే ఆయా మండలాల్లో గ్రౌండింగ్ చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాన్ని దళితులు వ్యక్తం చేస్తున్నారు. చింతకాని మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 4,312 కుటుంబాలు, చారకొండ మండలంలోని 14 గ్రామపంచాయతీల్లో 1,267 కుటుంబాలు, తిరుమలగిరి మండలంలోని మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల 16 గ్రామపంచాయతీల్లో 2,382 కుటుంబాలు, నిజాంసాగర్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 1,933 కుటుంబాలను గుర్తించారు. జిల్లా స్థాయి అధికారుల్లో ఒక్కొక్కరికీ మండలానికి ఒక్కో గ్రామ పంచాయతీ చొప్పున పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించేశారు.
లబ్దిదారులే ఎంపికలో అధికారుల జోక్యం..
పథకం అమలు తీరు, యూనిట్ల ఎంపిక తదితర అంశాలపై ఈ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.అయితే చింతకాని మండలంలో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న పరికరాలు, ఇతరాల వాటిపై అవగాహన కల్పించే పేరుతో అక్కడక్కడ జేసీబీలు, హర్వేస్టర్లు మాత్రమే తీసుకుంటే మంచిదని అంగీకరింపజేస్తున్నట్టు తెలుస్తున్నది.పాల డెయిరీ ఎంపిక చేసుకున్న వారకి హర్యానా నుంచి గేదెలు వస్తున్నాయని చెప్పటంతో ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో ఇప్పటి వరకు 429మంది డెయిరీఫాం, 69 మంది డీజే సౌండ్ సిస్టం,ఫొటోగ్రపీ ఐదుగురు,సెంట్రింగ్ 11 మందికి లక్షన్నర చొప్పున మాత్రమే గ్రౌండింగ్ అయింది. ఇందులో కొందరికి రూ. 50వేలు మాత్రమే అందాయి. 11 హార్వేస్టర్లు, 16జేసీబీలకు మాత్రం పూర్తి గ్రౌండింగ్ అయింది. మిగతా నియోజకవర్గాల్లోని మూడు మండలాల్లో అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు యూనిట్లపై అవగాహన కల్పించింది. కానీ.. లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమ మండలాలను పథకం అమలుకు ముందుగా ఎంపిక చేసి ఊరించారనీ, యూనిట్ల మంజూరులో జాప్యం చేస్తున్నారని అక్కడి ఎస్సీలు వాపోతున్నారు.
ఎదురుచూస్తున్నాం.. వేగం పెంచాలి.
ఎం.గోపాల్రావుకార్యదర్శి సీపీఐ(ఎం),చింతకాని మండలం
దళితబంధు పథకానికి చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయటం మంచిదే. అయితే ఇది జరిగి ఏడు నెలలు గడిచింది. ప్రభుత్వం చెప్పినంత ఈజీగా, తొందరగా గ్రౌండింగ్ కావటం లేదు. లబ్దిదారులు కోరుకున్న వాటిని ఇవ్వటం లేదు. అధికారులు లబ్దిదారులను కొన్నింటికి అంగీకరింపజేస్తున్నారు. షెడ్లకు రూ. 50వేలు ఇచ్చి మిగతావి మీరు పెట్టుకోండి..తర్వాత ఇస్తామని చెప్పటమేంటి? యూనిట్లను త్వరిత గతిన ఇవ్వాలి.