Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా సంగతేంటి సారూ?
- సర్కార్లకు ఆర్టీసీ కార్మికుల సూటి ప్రశ్న
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
ఇప్పుడు ఇదే ప్రశ్నను ఆర్టీసీ కార్మికులతో పాటు, సామాన్య ప్రజలూ ప్రభుత్వాలకు సంధిస్తున్నారు? టీఎస్ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33.33 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 66.67 శాతం వాటాలు ఉన్న విషయం తెలిసిందే. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 26 శాతం సొమ్మును వివిధ పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారు. సామాన్యంగా ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు వంటివి కడితే తమ ఇంటికీ, కాలనీకి ఆయా స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు అదనంగా ఏమేం సౌకర్యాలు కల్పించాయని ప్రశ్నిస్తారు. వాటికోసం అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల్ని నిలదీస్తారు. మరి ఆర్టీసీ నుంచి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కట్టించుకుంటున్న ప్రభుత్వాల నుంచి తమ సంస్థ అభివృద్ధి కోసం తిరిగి ఎంతిస్తున్నారు? అని అడగడంలో తప్పు ఏముంది? కానీ అలా అడిగితే యాజమాన్యానికీ, సర్కారుకు కార్మికులపై కోపం వస్తుంది. పైగా ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. దీన్నే ఇప్పుడు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. రూ.8,975 కోట్ల 43 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీఎస్ఆర్టీసీ ఏడేండ్లలో చెల్లించిన పన్నుల సొమ్ము. అదే కాలానికి సర్కారు నుంచి ఆర్టీసీకి రీయింబర్స్మెంట్ కింద రావల్సిన సొమ్ము రూ.5297.53 కోట్లు. వీటిలో విద్యార్థులు, జర్నలిస్టులు, వికలాంగులు సహా వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీల విలువే రూ.3,708.56 కోట్లు. సర్కారుకు పన్నుల రూపంలో కట్టిన రూ.8,975.43 లక్షల కోట్లు + రీయింబర్స్మెంట్ కింద రావల్సిన రూ.5,297.53 కోట్లు...రెండూ కలిపి మొత్తం రూ.14,272.96 కోట్లు. దీనిలో వివిధ పద్దుల కింద 2014-15 నుంచి 2020-21 వరకు (ఏడేండ్లు) ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన సొమ్ము రూ.6,284.94 కోట్లు. అంటే మిగిలిన రూ.7,988.02 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచేసుకున్నాయి. సంవత్సరానికి దాదాపు రూ.1,100 కోట్లకు పైగా ఆర్టీసీ ద్వారా ప్రభుత్వాలు ఆదాయాన్ని గడిస్తున్నాయి. అలాంటప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్టు ఎలా అవుతుందనేదే ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కార్మికుల సూటిప్రశ్న. ఆ సంస్థ మేనేజింగ్డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీని పక్కా వ్యాపార, వాణిజ్య సంస్థగానే చూస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకే బస్సుల్నీ నడుపుతున్నారు. లాభాలు రాకుంటే సర్వీసుల్ని రద్దు చేస్తున్నారు. బస్సులు తిరగట్లేదు కాబట్టి కార్మికులు ఎక్కువమంది ఉన్నారంటూ, వారికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను అమల్లోకి తెస్తున్నారు. ప్రజారవాణాను సామాజిక కోణంలో చూడాలే తప్ప, వ్యాపార, వాణిజ్య కోణంలో చూడరాదని గతంలో అనేక సంస్థలు సర్వేలు చేసి నివేదికలు ఇచ్చాయి. 2007లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు (ఐఐఎమ్బీ) ఆర్టీసీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు వసూలు చేయరాదని సిఫార్సు చేసింది. ఆ పన్నుల భారం లేకుంటే ఆర్టీసీ మరింత సమర్థవంతంగా ప్రతి పల్లె పల్లెకూ బస్సుల్ని తిప్పగలుగుతుంది. అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ అభివృద్ధిని నమోదు చేస్తుంది అనేది ఆ నివేదిక సారాశం. కానీ అందుకు భిన్నంగా ఆర్టీసీని ఆదాయ మార్గంగా చూడటం, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడాన్ని యాజమాన్యం నామోషీగా భావించడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల లెక్కలు తేల్చుకుంటే...ఆర్టీసీ లెక్కల్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే...! కార్మికుల కోరికలో తప్పేముంది?
ఏడేండ్లలో మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టిన పన్నులు అక్షరాలా రూ.8,975 కోట్ల 43 లక్షలు. టీఎస్ఆర్టీసీలో భాగస్వాములైన మీరిద్దరూ మాకిచ్చింది ఎంత?
- టీఎస్ ఆర్టీసీ కార్మికులు
ఎనిమిదేండ్లలో రాష్ట్రానికి రూ.2 లక్షల 53 వేల 202 కోట్లు ఇచ్చాం... (ఈనెల 14 తేదీ తుక్కుగూడ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభలో చేసిన ప్రకటన)
-కేంద్ర హౌంశాఖా మంత్రి అమిత్ షా
కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3 లక్షల 65 వేల 797 కోట్లు కట్టాం. వాళ్లిచ్చింది కేవలం రూ.1 లక్షా 68 వేల కోట్లు మాత్రమే...(ఈనెల 15వ తేదీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పిన లెక్కలు)
- రాష్ట్ర మంత్రి కే తారకరామారావు