Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-గార్ల
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పనులకు వెళ్లిన ఓ మహిళ ఎండవేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్న కిష్టాపురం గ్రామానికి చెందిన మహిళ మాళోత్ సోల్తా(60) నెల రోజులుగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్తోంది. రోజు మాదిరిగానే ఉదయం ఉపాధి పనులకు వెళ్ళిన సోల్తా పని ప్రదేశంలో సొమ్ము సిల్లి పడిపోయింది. గమనించిన తోటి కూలీలు చికిత్స నిమిత్తం మానుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమారులు, భర్త లాల్ సింగ్ ఉన్నారు. కాగా మృతురాలు సోల్తా కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, వ్యకాస మండల కార్యదర్శి వంగూరి వెంకటేశ్వర్లు, నాయకులు మెదరమెట్ల గిరి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధి కూలీ మృతదేహానికి వారు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
పనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో సోల్తా వడదెబ్బకు గురై చనిపోయారని ఆరోపించారు.