Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా.. ఆయన బోధనలను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉందనీ, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని తెలిపారు. కృష్ణానది ఒడ్డున నాగార్జున సాగర్‌లో ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమైన 'బుద్ధవనం' బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి, జాతికి అంకితం చేసిందని చెప్పారు. బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవ నాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో తెలంగాణ ప్రభుత్వం పయనిస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.
బుద్దుడు సమానత్వాన్ని కోరుకున్నాడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
బుద్దుడు సమానత్వాన్ని కోరుకున్నాడనీ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తవ్వినా..బౌద్ధ నిక్షేపాలు బయటపడు తున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌతమ బుద్ధుని 2,566వ జయంతి సంద ర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుడి విగ్రహం వద్ద బౌద్ధ భిక్షువులు,రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బుద్ధుడికి నివాళులు అర్పించారు.
అనం తరం మంత్రి మాట్లాడుతూ.. అజ్ఞానం తొలగించి విజ్ఞానం వైపు అడుగుల వేయించడం, మనిషిలో మార్పు, మనిషి చరిత్ర, జీవనం ఎలా కొనసాగిం చాలి, మనిషి లక్షణాలు, మనుగడ ఎలా ఉండాలనే అంశా లపై ప్రపంచానికి జ్ఞాన బోధన చేసిన మహాత్ముడు గౌతమ బుద్ధుడని అన్నారు. భవిష్యత్‌లో బౌద్ధమతానికి సంబంధించి ఓ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి ప్రపంచంలోని దలైలామాతో పాటు థాయిలాండ్ టిబెట్, శ్రీలంక, చైనా తదితర దేశాల నుంచి బౌద్ధ గురువులను రప్పించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.