Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు ప్యాకేజీలుగా విభజన
- 3750 ఎకరాల భూమి అవసరం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
విజయవాడ-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా చేపట్టే మంచిర్యాల విభాగం రహదారికి జనవరి మొదటి వారంలోగా టెండరింగ్ వర్కులు పూర్తి అవనున్నాయి. త్వరలో భూసేకరణకు గెజిట్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) విడుదల చేయనుంది. మంచిర్యాల-విజయవాడ, మహారాష్ట్ర సరిహద్దు నుంచి మంచిర్యాల నాగ్‌పూర్ వరకు ఈ ఎక్స్ప్రెస్హైవేను నిర్మించనున్నారు. ఇందుకోసం 3,750 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. విజయవాడ-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను అయిదు ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో విజయవాడ-ఖమ్మం, ఖమ్మం-వరంగల్, వరంగల్-మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్ధారించారు. మంచిర్యాల- రేపల్లెవాడ, రేపల్లెవాడ-చంద్రాపూర్ ప్యాకేజీలను బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా విభజన చేశారు. ఇక మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి నాగ్‌పూర్‌కు ఇప్పటికే ఉన్న నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేకి ఈ రహదారిని అనుసంధానం చేయనున్నారు. కాగా తెలంగాణలో ఈ ఎక్స్‌ప్రెస్ హైవే మహారాష్ట్ర సరిహద్దు నుంచి మంచిర్యాల వరకు 95 కిలోమీటర్లు, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ వరకు 305 కిలోమీటర్ల రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. మొత్తంగా 400 కిలోమీటర్లు ఉండగా, తెలంగాణ ప్రాంతంలో 370 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్హైవేను నిర్మించనున్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. మిగతా 30 కిలోమీటర్లు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి విజయవాడ వరకు ఉంటుందనీ, దాన్ని నిర్మాణ బాధ్యతలు కూడా ఎన్హెచ్ఏఐ హైదరాబాద్ రీజినల్ ఆఫీస్ విభాగం పర్యవేక్షిస్తుందని వివరిస్తున్నారు. మొత్తంగా ఈ రహదారి నిర్మాణానికి రూ. 8,900 కోట్లు, సుమారు 3,750 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. గెజిట్ అవార్డు చేసిన అనంతరం భూసేకరణ పూర్తయ్యేవరకు ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టొచ్చనీ, జనవరి వరకు పనులు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తవుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు భావిస్తున్నారు.