Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలరోజులపాటు ముఖ్యనేతలంతా పాల్గొనాల్సిందే
- ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో నేను పాల్గొంటా
- తెలంగాణలో పాదయాత్ర చేయాలని రాహుల్‌గాంధీని కోరతాం : టీపీసీసీ అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రచ్చబండల, రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా డప్పుల చప్పుళ్ల ద్వారా వరంగల్ రైతు డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. డిక్లరేషన్‌పై ఐకేపీ కేంద్రాలు, రైతు బజార్, వైన్ షాపులు , కల్లు కాంపౌండ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామనీ, తానే స్వయంగా వైన్‌షాపుల ముందు ప్లెక్సీలు కడుతానని తెలిపారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి తలపెట్టిన కాంగ్రెస్ జోడో భారత్ కార్యక్రమాన్ని రాహుల్‌గాంధీ తెలంగాణలో ప్రారంభించి వంద రోజులు కొనసాగించాలని కోరుతూ టీపీసీసీలో తీర్మానించామనీ, దాన్ని ఏఐసీసీ అధినేత సోనియాగాంధీకి పంపుతామని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో పీఏసీ సభ్యులు, సీనియర్ నాయకులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల చైర్మెన్లు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ..రచ్చబండ కార్యక్రమం జయప్రదానికి అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా (హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయించి) 400 మంది ముఖ్యనేతలు తప్పనిసరిగా బాధ్యత వహించాలని కోరారు. మే 21న రాష్ట్రంలో గొప్ప చరిత్ర కలిగిన గ్రామాలను ఎంచుకుని అక్కడ జరిగే రచ్చబండలో రైతులతో చర్చించాలనీ, వారు చెప్పే విషయాలను నోట్ చేసుకోవాలని సూచించారు. అధ్యక్షుని హోదాలో తాను వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో పాల్గొంటానని ప్రకటించారు. అందరి కృషితోనే రాహుల్ సభ జయప్రదమైందని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తిచేశామనీ, పార్టీ సభ్యులకు ప్రమాద బీమా చేయించామని తెలిపారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్‌లోని కార్యాలయంలో తెలపాలని సూచించారు. ఉదరు పూర్లో జరిగిన చింతన్ శిబిర్‌లో తెలంగాణలో డిజిటల్ మెంబర్షిప్, వరంగల్ డిక్లరేషన్‌కు తెలంగాణ మోడల్ అని పేరొచ్చిందనీ, రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో చేపడితే మరింత జోష్ వస్తుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లడం శుభపరిణామం అన్నారు. జనజాగరణ్ అభియాన్ యాత్ర కార్యక్రమాలు చేపట్టాలనీ, పెరిగిన ధరలపై కూడా క్షేత్రస్థాయి నుంచి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఏడాది కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ నాయకులకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్‌కు మోడీ, అమిత్‌షా మద్దతు
తమ మాట వినని సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ విచారణను ఎక్కుపెట్టే మోడీ, అమిత్ షాలు కేసీఆర్‌ను ఎందుకు వదిలిపెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. టెండర్లు వేయకముందే..నైనీ కోల్ బ్లాక్‌లో అవినీతి జరుగుతున్నదని ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్ అవినీతికి మోడీ, అమిత్‌షా మద్దతు ఉందనీ, ఫలితంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో బీజేపీకి కేసీఆర్ డబ్బులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. జాతీయస్థాయిలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నాయన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్, మోడీ మరణ శాసనం రాస్తున్నారని విమర్శించారు. తుక్కుగూడలో జరిగిన బీజేపీ తుక్కు సభలో తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో ఒక్క మాటైనా అమిత్ షా చెప్పారా? అని ప్రశ్నించారు. బీజేపీ, టిఆర్ఎస్ నేతలు వరంగల్ డిక్లరేషన్‌పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తిట్లను ఎజెండాగా చేసుకుని టిఆర్ఎస్, బీజేపీలు పబ్బం గడుపుతున్నాయనీ, తాము ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.