Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంటర్లోకి సిబ్బంది ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించం
- విద్యాశాఖ డైరెక్టరేట్లో కంట్రోల్ రూం
- విద్యాశాఖ అధికారులతో సమీక్షలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మే 23వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లు ఆయా పాఠశాలకు చేరాయని చెప్పారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఎంఈఓ ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేయాలని ఆదేశించారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన రీతిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా ఉద్యోగిని ఉంచి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా జిల్లాల వారిగా పరిశీలకులను నియమిస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలుండేలా ముందుగానే తనిఖీలను నిర్వహించాలనీ, లోనిచోట్ల పరీక్షల నాటికి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పదోతరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని చెప్పారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.