Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన
నవతెలంగాణ - ముస్తాబాద్/చందుర్తి
రాజన్న సిరిసిల్లలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ముస్తాబాద్, చందుర్తి మండలాల్లో రైతులు సోమవారం ఆందోళన చేశారు. కేంద్రాల్లో ధాన్యం పోసి 20రోజులైనా కొనుగోలు చేయలేదని ముస్తాబాద్‌లో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ జ్యోతిలక్ష్మి సంఘటనాస్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని ప్రధాన రహదారిని దిగ్బంధనం చేసి వంటావార్పు నిర్వహించారు. సీఐ ఉపేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో బస్తాపై అదనంగా ధాన్యం తూకం వేస్తున్నారని తెలిపారు. ఇన్ని రోజులుగా కొనుగోలు చేయనందున వర్షానికి తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు.చందురిత మండల కేంద్రంలో కోరుట్ల - వేములవాడ రహదారిపై రైతులు బైటాయించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ నరేష్, ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికొచ్చి రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.