Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం
- ఎదురుతిరిగిన ఆదివాసీ రైతులు
నవతెలంగాణ-కొత్తగూడ
ఏజెన్సీలో పోడు రగడ మళ్ళీ మొదలైంది. అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహనికి ఆదివాసీ రైతులు ఎదురుతిరిగి అటవీశాఖ అధికారులను వెనక్కి పంపారు. కందకాల పేరుతో అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి.. బాహాటంగానే ఆదేశాలు ఇచ్చినా అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆదివాసీ రైతులపై విషం చిమ్ముతున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామం జంగాలపల్లి చెరువు సమీపంలోని సాగు భూముల్లో అటవీశాఖ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ 40 ఏండ్లుగా వారి తాతల నుంచి పోడు సాగు చేసుకుంటున్న భూముల్లో కందకాలు తీసేందుకు ప్రయత్నించారు. దాంతో సాగులో ఉన్న ఆదివాసీ రైతులు అటవీశాఖ అధికారులను అడ్డుకొని సమస్యలను వినిపించే ప్రయత్నం చేశారు.
అవేమీ పట్టనట్టు అటవీశాఖ అధికారులు పోడు సాగుదారులపై దౌర్జన్యానికి దిగారు. 40 ఏండ్లుగా కష్టపడి సాగు చేసుకుంటున్న భూములను ఇప్పుడు వచ్చి లాక్కుంటామంటే ఊరుకునేది లేదని, మా ప్రాణాలైనా వదులుకుంటాం.. కానీ భూములను వదిలిపెట్టేది లేదని తెగేసి చెప్పారు. మీ కమిషన్ల కోసం మా బతుకుల్లో మన్ను పోస్తే మరో పోరాటం తప్పదని అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అటవీశాఖ అధికారులు వెనుదిరిగి వెల్లిపోయారు.