Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసలు నిందితులపై పోలీసుల ఫోకస్
- కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో నగర పోలీసుల సమన్వయం
- దేశ వ్యాప్తంగా మత్తులో పది కోట్ల మంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సరఫరాలో తరచూ సరఫరాదారులు, వినియోగదారులు మాత్రమే పట్టుబడుతున్నారు. అసలు సూత్రదారులు మాత్రం దొరకడం లేదు. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అసలు సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరిగిందని, పది కోట్ల మంది వ్యసనానికిలోనై మత్తులో జోగుతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఐదేండ్లలో విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన వారిని మాత్రమే పోలీసులు గుర్తించగలిగారు. అసలైనవారు నైజీరియా, టాంజానియా, ఉగాండా, ఆఫ్రికా దేశాల్లో ఉంటున్నారని పోలీసుల అంచనా. అక్కడి నుంచే గోవా, బెంగళూర్, మహారాష్ట్ర, ఢిల్లీ, ముంబాయితోపాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు వివిధ రూపాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేసేదెవరనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది.
కొద్ది నెలల కిందట బడా డ్రగ్స్ స్మగ్లర్ టోనీని నగర పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వారం రోజుల కిందట మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యుల్లోని నలుగురిని వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. 225 గ్రాముల కొకైన్, 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కానీ ప్రధాన సూత్రధారులు మాత్రం ఇంత వరకు చిక్కలేదు.
ఎయిర్‌పోర్టులో కిలోల కొద్దీ డ్రగ్స్
ఎయిర్‌పోర్టులో పట్టుబడుతున్న కిలోల కొద్దీ డ్రగ్స్ తీసుకొస్తున్న వారు సైతం తమకేమీ తెలియదని చెబుతున్నారు. మూడు నెలల్లోనే రూ.200 కోట్ల విలువ చేసే హెరాయిన్, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలను ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన వారిని విచారిస్తే ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇక్కడ సరఫరాదారులు మాత్రమే కాదు, వాటిని తీసుకునే వారి వివరాలు కూడా తెలియదని నిందితులు విచారణ సమయంలో అధికారులకు చెపుతుండటం గమనార్హం. డ్రగ్స్ తీసుకొస్తున్న వారు ఎయిర్‌పోర్టు నుంచి క్షేమంగా బయటకు వస్తేనే ఇక్కడ తీసుకునే వ్యక్తి సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత నగరంలో సరఫరా చేస్తారు. అయితే, పట్టుబడుతున్న డ్రగ్స్ తక్కువగా ఉంటుందని, సరఫరా పెద్దఎత్తన జరుగుతోందని పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
70 శాతం పెరిగిన వినియోగం
ఏడేండ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం డ్రగ్స్ సరఫరా అయిందని ఓ సర్వేలో వెల్లడైంది. మాదక ద్రవ్యాల వాడకం వేగంగా విస్తరిస్తున్నదని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశంలో 2014 నుంచి ఇప్పటివరకు 70 శాతం డ్రగ్స్ వాడకందారులు పెరిగారని, దాదాపు 10 కోట్ల మంది మత్తులో జోగుతున్నారని ఎన్సీబీ (నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో) ఇటీవలే ప్రకటించింది.
ఇటీవల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.125 కోట్ల డ్రగ్స్ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. 70 శాతం ఓడరేవులు, 20 శాతం రోడ్డు రవాణా, 10 శాతం విమానాల ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని పోలీస్ అధికారులు గుర్తించారు. ఓడరేవుల వద్ద పటిష్ట బందోబస్తుకు, అవసరమైన టెక్నాలజీ వినియోగానికి ఆయా సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు నగర పోలీసులు కేంద్ర, రాష్ట్ర నిఘా, దర్యాప్తు సంస్థల సమన్వయంతో ముందుకెళ్లేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈడీ, ఎన్సీబీ, సీఐఎస్ఎఫ్, కస్టమ్స్, డీఆర్ఐ వంటి ఏజెన్సీలు, పోలీసుల సమన్వయంతో పనిచేయనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వ్యవస్థలతోనూ అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే దేశంలో డ్రగ్స్ సరఫరా తగ్గే అవకాశముందని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.