Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై మోయలేని భారాలు
- ఉపాధిని పటిష్టంగా అమలు చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిలో చేతులెత్తేసి రాష్ట్రాలకే ఉత్పత్తి బాధ్యతను అప్పగించడం ద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారాలు మోపిందని విమర్శించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాలులో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృ స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. వలసల నివారణ కోసం పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. ప్రధానంగా ఉపాధిలో నూతన యాప్లు తీసుకొచ్చి కూలీలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పనులు అమలు చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే కాకుండా.. పన్నుల రూపంలో, సెస్ ద్వారా కూడా డబ్బులు వసూలు చేస్తుండటంతో రాష్ట్రాలకు తీరని అన్యాయం వాటిల్లుతోందన్నారు. తద్వారా నిత్యావసర వస్తువులైన పప్పు, నూనె వంటి వాటి ధరలు చుక్కలనంటుతు న్నాయన్నారు. ప్రజలకు పౌష్టికాహారం అందించాలంటే 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మతమౌఢ్యానికి మారుపేరుగా ఉన్న బీజేపీ ముస్లీం వ్యతిరేకతను రోజురోజుకూ పెంచుతూ ప్రజల మధ్య చిచ్చు రేపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్న ప్రతి పేద కుటుంబానికీ రూ.7,500 అందజేయాలన్నారు.
ఇచ్చిన హామీలను మరిచి కేసీఆర్ దళితబంధును భూస్వామి బంధుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఉద్యో గాలు, నిరుద్యోగ భృతి, భూపంపిణీ ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి వారికి వేతనాలు పెంచాలన్నారు. లేకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాజీలేని మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించి విప్లవ నినాదాలు చేశారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ, సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు, ఎన్వీ.రమణ, నాయకులు ఎండీ.జబ్బార్, వర్ధం పర్వతాలు, గద్వాల, ఎ.వెంకటస్వామి, వెంకట్రామిరెడ్డి, కిల్లే గోపాల్, పద్మ, లక్ష్మీ, నర్మద, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు.