Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల అరెస్టు, విడుదల
- ఇది ఆరంభం మాత్రమే: ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అడివయ్య
నవతెలంగాణ భువనగిరి/ భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ హైవే నుంచి ఇండ్ల వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకుని పోలీసులు వికలాంగులను అరెెస్టు చేశారు. దాంతో తోపులాట జరిగింది. డబుల్ బెడ్రూం ఇండ్లలో 5శాతం వికలాంగులకు కేటాయించాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రంలో గూడుకోసం వికలాంగులు పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో 5శాతం వికలాంగులకు ప్రత్యేక వాటా కేటాయించాలని నిర్ణయించి 2017లో ప్రభుత్వం 1836 మెమో విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని అమలు చేయాలని అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కట్టిన ఇండ్లు ఇవ్వలేని ప్రభుత్వానికి అరెస్టులు చేయించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ముఖ్యమంత్రి కేవలం సిద్దిపేట జిల్లాకేనా అని ప్రశ్నించారు. నిరుపేద వికలాంగులకు ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. జీఓ 01 ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 5 శాతం వికలాంగులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. స్థలం ఉన్న వికలాంగులకు ఇంటి నిర్మాణ వ్యయం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల కోసం వేల ఎకరాలు భూమి కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 150 గజాల ఇంటి స్థలం ఇవ్వలేదా అని నిలదీశారు. జిల్లాలో వంగపల్లి, ఆలేరు, పోచంపల్లి, కొలంపక, తుర్కపల్లి, జిబ్లాక్ పల్లి, ఆత్మకూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఇప్పటి వరకు ఒక్క వికలాంగునికి కూడా ఇల్లు కేటాయించలేదని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ఆక్రమణ ఇది ఆరంభం మాత్రమే అని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాపితంగా విస్తరిస్తామని హెచ్చరించారు. అరెస్టు అయినవారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి బి.స్వామి, మహిళా విభాగం కన్వీనర్ లలిత, నాయకులు పద్మ, అనుసుజ, నాగరాజ్, లింగ్య నాయక్, సంజీవ శంకర్, శ్రీనివాస్ వెంకటేష్ నాయక్, మోహన్, యాదగిరి, మురళి నాయక్, మురళి, రమేష్, ప్రశాంత్, మధుకర్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
విడుదల చేయాలని రాస్తారోకో, పరామర్శలు
అరెస్టైన నాయకులను, వికలాంగులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ అధ్వర్యంలో ధర్నా చేశారు. అరెస్టైన వారిని పట్టణ పోలీస్ స్టేషన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమాడుగు నర్సింహా, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మెన్ జహంగీర్, కాంగ్రెస్ మున్సిపల్ ప్లోర్ లీడర్ ప్రమోద్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్యామ్‌సుందర్, కాంగ్రెస్ నాయకులు హరిప్రసాద్, మంగ ప్రవీణ్ శాఫివుల్ల, బాబులు, అందే నరేష్, బింగి నరేష్, సామజిక ఉద్యమ నాయకులు బట్టు రామచంద్రయ్య పరామర్శించారు.