Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగువ భద్ర, ఎగువ తుంగ నిర్మాణాలతో రాష్ట్రానికి నష్టం
- సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో సర్కారు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కృష్ణానదిపై కర్నాటక రాష్ట్రం నిర్మిస్తున్న అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ నిర్మాణాలను ఆపేందుకు కార్యాచరణ ప్రారంభించింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా 12.24 టీఎంసీల నీటిని, అప్పర్ తుంగ ద్వారా 29.30 టీఎంసీల నిటిని వినియోగించుకునేందుకు కర్నాటక రాష్ట్రం ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నదని సమాచారం. ఈ రెండింటి పరిధిలో 3.06 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి ఎగువ నుంచి చుక్కనీరు కూడా రాదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎగువ తుంగ పరిధిలోని ఆరు డిస్ట్రీబ్యూ టరీల పనులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎఫ్ఐసీ పనులు ఇంకా నడుస్తున్నాయి. అలాగే ఎగువ భద్రకు సంబంధించి అన్ని పనులు వేగంగా నడుస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా కర్నాటక ముందుకు వెళ్లడం దారుణమని రాష్ట్ర సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ట్రిబ్యునళ్లు, మార్గదర్శకాలకు విరుద్ధంగా కర్నాటక వ్యవహరిస్తున్నా, ఆ నిర్ణయాల వైపే కేంద్రం మొగ్గుచూపు తున్నదనే ఆరోపణలు, విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతు న్నాయ. ఈ నేపథ్యంలో న్యాయపరంగా కర్నాటకను ఎదుర్కోంటూ ఆ రెండు ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవాలని రాష్ట్రం అంతర్గత సమాలోచనలు చేస్తున్నది. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేయాలని రాష్ట్ర సాగునీటి శాఖ వ్యూహాంగా కనిపిస్తున్నది. ఇందుకు న్యాయనిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టు నిర్మాణానికి ఉపక్రమించిన కర్నాటక, ఎలాగైనా వాటిని పూర్తిచేస్తుందని ఆ రాష్ట్ర గత చరిత్ర తెలిసిన సాగునీటి శాఖ సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రారంభించిన రెండింటి నిర్మాణాలకు నిలిపివేయడంతోపాటు అనుమితులు ఇవ్వొద్దంటూ ఇప్పటికే కేంద్ర జలశక్తిశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణ మైతే తుంగభద్ర నుంచి కృష్ణానదిలోకి నీటి ప్రవాహం తగ్గుతుందనీ, ఆ మేరకు రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని సాగునీటి శాఖ ఉన్నతాధికా రుల అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కర్నాటకతో పాటు కేంద్ర జలశక్తిశాఖతోనూ కోర్టు ద్వారా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నీటి కేటాయింపులు లేకుండా ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే, ఆ ప్రభావం దిగువన ఉన్న తెలంగాణపై కచ్చితంగా పడుతుందని సాగునీటి శాఖ అధికారులు అంచనా. చిన్న, మధ్యతరహా ప్రాజక్టులు, లిఫ్టుల రూపంలో సుమారు 288 టీఎంసీల అదనపు నీటిని కర్నాటక వాడుకుంటున్నదనీ, 2003లోనే సాక్షాధారాలతో సహా కేంద్ర జలసంఘానికి పలు ఫిర్యాదులు, లేఖలు వెళ్లాయి. కర్నాటకతోపాటు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు ఆ రాష్ట్రం సులువుగా అనుమతులు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాష్ట్ర సాగునీటి శాఖ అధికారులు అభిప్రాయంగా ఉంది. ఈ తరుణంలో సుప్రీం కోర్టులో కేసు వేయడం ద్వారానే అటు కేంద్రాన్ని, ఇటు కర్నాటక రాష్ట్రాన్ని నిలువరించేం దుకు సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈమేరకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారిక సమాచారం. అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.