Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటో, క్యాబ్, లారీ, డీసీఎమ్ సహా అన్నీ బంద్
- సహకరించండి :ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆటోలు, లారీలు, క్యాబ్‌లు, డీసీఎమ్‌లు సహా ప్రయివేటు రంగంలోని అన్ని రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు గురువారం సమ్మె చేస్తున్నారు. ఊబర్, ఓలా, ర్యాపిడో సహా ఎలాంటి రవాణా వాహనాలు రోడ్లపై తిరగబోవని 12 కార్మిక సంఘాలతో కూడిన తెలంగాణ స్టేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. సమ్మెలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఏడీఎస్, ఏడబ్ల్యూఏ, జీయూటీఎస్, టీఏడీజేఏసీ, జీహెచ్సీఏడీఏ, టీఎస్టీడీజేఏసీ సంఘాలు పాల్గొంటున్నాయి. ఆయా వాహనాల యజమానులు, డ్రైవర్లు సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలనీ, ఆ బిల్లును ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 714(ఈ) నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఒక్క రోజు రవాణా సమ్మె చేపడుతున్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారంనాడిక్కడి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆటో, క్యాబ్, లారీ బంద్ వాల్‌పోస్టర్‌ను విడుదల చేసి, మీడియాతో మాట్లాడారు. ఫిట్నెస్ గడువు అయిపోతే రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధిస్తూ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన 714(ఈ) నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణామంత్రి పువ్వాడ అజరుకుమార్ ఎవరికీ అందుబాటులో ఉండట్లేదనీ, అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఉపయోగం లేకుండా ఉందని జేఏసీ కన్వీనర్ బీ వెంకటేశం, నాయకులు ఎమ్డీ అమానుల్లాఖాన్, ఏ సత్తిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆర్ మల్లేష్, ఏ బిక్షపతి యాదవ్, ఉమర్ఖాన్, లతీఫ్ విమర్శించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రవాణా భవనంలోని కమిషనర్ కార్యాలయం, మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఛాంబర్‌ను ముట్టడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా వాహనాల యజమానులు, డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే సమ్మె పిలుపు అమల్లోకి వస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలనీ, ఆటో క్యాబ్ మీటర్ రేట్లు పెంచాలనీ, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సింగిల్ పర్మిట్ ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.