Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసి నమ్మండి : పీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అరవై ఏండ్లలో తమ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలెన్నో చేసిందనీ, ఆ చరిత్రను చూసి తమను నమ్మాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న విష ప్రయోగానికి లోనై కాంగ్రెస్ పార్టీని అనుమానంతో చూడొద్దని కోరారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ, వెంటనే 30 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు బంధు పథకాన్ని ఆగర్భ శ్రీమంతులకు ఇస్తున్నారనీ, బెంజి కార్లతో వెళ్లి రైతు బంధు తెచ్చుకుంటున్నారని చెప్పారు. అలాంటి వారికి రైతు బంధు ఇవ్వకూడదని కాంగ్రెస్ నిర్ణయించిందని వెల్లడించారు. రైతును బతికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనీ, చచ్చిపోయిన తర్వాత రూ ఐదు లక్షలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 73 వేల మందికి ఐదు లక్షల చొప్పున బీమా అందించామంటూ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసైన్డ్, పోడు భూములకు పట్టాలిస్తామనీ, అందుకోసం అవసరమైతే చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రేవంత్ మాట్లాడారు. శ్రీలంకతో తెలంగాణ పోటీ పడే పరిస్థితి వచ్చిందనీ, ఇక్కడ కేసీఆర్ కుటుంబంపై ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏడేండ్లలో 8,400 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చనిపోతే టీఆర్ఎస్ గొప్పలు చేప్పిందని గుర్తు చేశారు. తెలంగాణలో అన్ని పంటలు పండించే భూములున్నాయనీ, ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలో, ఆ రైతును ఏ విధంగా ఆదుకోవాలో నాటి ప్రభుత్వాలు ఆలోచించాయని చెప్పారు.కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల రైతులు చెరుకు, పసుపు, కందులు, ఎర్రజోన్న పంటలను పండించడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా మార్చుకున్నారని చెప్పారు. అన్ని పంటలు మాయమై...వరి, పత్తి మొక్కజొన్న పంటలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రాజెక్టులను ద్వారా సాగునీరు ఇస్తున్నప్పుడు 30 లక్షలకు పంపుసెంట్లు, వాటికి ఉచిత కరెంట్ ఎందుకు? అని సీఎంను ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కమిషన్లు దిగమింగారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ, రైతు డిక్లరేషన్ అమలు చేయించే బాధ్యత పీసీసీ అధ్యక్షుడిగా తనదేనన్నారు. అసైన్డ్, పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని భరోసా ఇచ్చారు. రైతుబంధు పథకానికి, పంటలకు ముడిపెట్టబోమనీ, రైతు తనకు నచ్చిన పంట పండించుకోవచ్చనన్నారు. రైతులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు రైతు కమిషన్ నియమిస్తామని వివరించారు. భూ యాజమానికి, కౌలు రైతుకు ఎలాంటి సంబంధం లేకుండానే రైతుబంధు అమలు చేస్తామన్నారు. 'ఎన్నికల సమయంలో ఊరికెళ్లి కాంగ్రెస్‌కు ఓటేయండి... అమలు చేసి చూపిస్తాం...అంతవరకు ధైర్యంగా ఉండండి' అని విజ్ఞప్తి చేశారు.రెండు లక్షల రుణమాఫీ చేస్తామనీ, లాంగ్ టర్మ్ లోన్ల (ఎల్టీఎల్)పై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. ధరణి పరిపాలన సౌలభ్యం కోసం ఉండాలి...కానీ హైదరాబాద్‌లో వివాదస్పద భూములను తన బంధువులకు కట్టబెట్టేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని ఆరోపించారు. పాత రెవెన్యూ రికార్డులను అర్థం చేసుకుని సులభతరమైన పోర్టల్‌ను కాంగ్రెస్ తెస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నో పథకాలను తమ పార్టీ అమలు చేసిందనీ, ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పసుపుబోర్డు కూడా ఏర్పాటుచేస్తుందన్నారు. అదిపెద్ద సమస్య కాదని చెప్పారు.60 ఏండ్లలో కాంగ్రెస్ అప్పులభారం మోపింది రూ 69వేల కోట్లే..కేసీఆర్ ఏడేండ్లలో రూ 5లక్షల కోట్లు అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. కార్యక్రమానికి వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడి, సాధిక్ సమన్వయ కర్తలు వ్యవహరించారు.