Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదనీ, అర్హులైన వారందరికీ వెంటనే మంజూరు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని నేటికీ మంజూరు చేయలేదని విమర్శించారు. ఏడేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు. కనీసం కార్డుల్లో చేర్పులు, మార్పులకూ అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నిర్మించిన ఇండ్లను పంపిణీ చేసే పరిస్థితి లేదన్నారు. ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తామన్న రూ.3లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గించడం.. ఉన్న నిధులు దారి మళ్లించటం వల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. మరోపక్క పెరిగిన గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పప్పులు, మంచి నూనె ధరలు చుక్కలనంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొనలేని తినలేని పరిస్థితి దాపురించి, పేదలు అర్ధాకలితో జీవిస్తున్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, కేజీ టూ పీజీ విద్య అందని ద్రాక్షే అయిందన్నారు. ప్రజల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. నెల రోజులుగా జిల్లాలో గ్రామ గ్రామానా సర్వేలు నిర్వహించి ప్రజల సమస్యలపై మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్తు సమస్యలు, పింఛన్లు, రేషన్‌కార్డులు, అభయహస్తం పింఛన్లు రాని పరిస్థితి ఉందని సర్వేలో తేలిందన్నారు. పేదలకు భూములు ఇవ్వకపోగా పల్లె ప్రకృతివనం పేరుతో డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాధ, దైదా జానకమ్మ, జిట్టా సరోజా, జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి, జిల్లా ఆఫీసు బేరర్ తుమ్మల పద్మ, భూతం అరుణ, కారంపూడి ధనలక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.