Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదివారం, మంగళవారం కురిసిన అకాల వర్షాలకు వరిధాన్యం తడిసి ముద్దయ్యిందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల కల్లాలు, రోడ్ల వెంబడి కుప్పలు పోసుకున్న ధాన్యానికి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. అకాల వర్షాలు, వరదలకు వరిధాన్యం కొట్టుకుపోయందని తెలిపారు. తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబోసుకునే అవకాశం లేక మొలకలొస్తాయనే భయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం 6,832 కొనుగోలు కేంద్రాలకు 6,369 కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. 20.25 లక్షల మెట్రిక్ టన్నులకుగాను 19.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్న కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వరిధాన్యం ఎక్కడికక్కడే కుప్పలు పోసి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత లేకుండా రాజకీయ విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటూ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పండిన వరిధాన్యాన్ని సేకరించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తడిసి ముద్దయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి ఆరబెట్టి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారులు తరుగుకు పాల్పడుతున్నందున కొనుగోలు కేంద్రాలపై నిఘా పెట్టాలని సూచించారు.