Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుల్లో పెద్దమొత్తంలో అవినీతి : టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమ కారులకు కనీసం ఆత్మగౌరవం దక్కడం లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షులు కోదండరామ్ అన్నారు. సమాచార కమిషన్ పని చేయదనీ, ప్రశ్నించే గొంతులకు స్థానం ఉండబోదని చెప్పారు. మంత్రులకు ఆత్మగౌరవం లేదనీ, ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నదని విమర్శిచారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టారని అన్నారు. సచివాలయం లేకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికరంగం రాజకీయాలతో పెనవేసుకుందని విమర్శించారు. ఇసుక, భుదందాలు పెరిగిపోయాయని వివరించారు. ప్రగతి భవన్‌లోకి ప్రవేశం రాష్ట్ర ప్రజల కంటే ఆంధ్ర గుత్తేదార్లకు సునాయాసంగా దొరుకుతుందని అన్నారు. విద్యావైద్యంలో రాష్ట్రం వెనుకబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆంధ్ర గుత్తేదార్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ ఆంధ్రా పాలకులకు దళారీగా మారిపోయారని అన్నారు. అందుకే వచ్చేనెల రెండున హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపడతామనీ, ఉద్యమకారులను ఏకం చేస్తామని చెప్పారు. ఆత్మగౌరవం కోసం మరోపోరాటం ప్రారంభిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం సంపదను దోచుకుంటున్నదని విమర్శించారు. ఎనిమిదేండ్లు భరించామనీ, ఇక దోపిడీ, దళారీకి వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుని సంపన్నులకు కట్టబెడుతున్నదని విమర్శించారు. కృష్ణా జలాల్లో వాటా అడగరనీ, పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తే సీఎం కేసీఆర్ నోరుమెదపడం లేదని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంపై భారీగా ఖర్చులు పెంచారనీ, కానీ వాటిని పూర్తి చేయలేదని అన్నారు. తాము పోరాటం చేసిన తర్వాత మంత్రి కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటి కోసం మళ్లీ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గోదావరి జలాల ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులకు సాగు నీరు అందడం లేదని వివరించారు. రైతుల పంటలకు నీళ్లు లేవని విమర్శించారు. రాష్ట్రంలో మొక్కుబడిగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తున్నారని విమర్శించారు. ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని తొలగించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వర్రావు, గంగాపురం వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, నిజ్జన రమేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు రాజా మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, బట్టల రాంచందర్, హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.