Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఓ రోడ్డు ప్రమాదంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం వద్ద ప్రతి రోజు మాదిరిగానే బుధవారం ఉదయం రహదారుల పక్కన ఉన్న మొక్కలకు నీళ్లు పోసేందుకు, విత్తనాలు సేకరించేందుకు తన ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయలు దేరారు. రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢకొీట్టింది. దాంతో వనజీవి రామయ్య కాలుకు తీవ్ర గాయం కాగా, తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎం శ్రీనివాసరావు, వైద్యనిపుణులు రాజశేఖర్ గౌడ్, వైద్య సిబ్బంది దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. కాలుకు తీవ్ర గాయం కావడం వల్ల శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
పరామర్శలు, మెరుగైన వైద్య సేవలకు ఆదేశాలు
వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ సంతోష్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎంపీ రేణుక చౌదరి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వనజీవి రామయ్యతో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం వనజీవి రామయ్యకు అవసరమైన అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనపై వనజీవి కుమారుడు కనకయ్య ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.