Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 మందికి గాయాలు
- వరంగల్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-ఖానాపురం
ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతిచెందిన విషాదకర సంఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో బుధవారం జరిగింది. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. అశోక్‌నగర్ గ్రామ శివారు పర్శా తండాకు చెందిన ధారవత్ ధన్సింగ్ తన కూతురు పెండ్లి సామగ్రి కోసం తన కుటుంబానికి అత్యంత సన్నిహితులైన 15 మందిని తీసుకొని ఓ ట్రాక్టర్లో నర్సంపేట పట్టణానికి బయలుదేరారు. ధన్సింగ్ మాత్రం తన కూతురుతో కలిసి ఓ ద్విచక్రవాహనంలో ట్రాక్టర్ వెనక ఫాలో అయ్యారు. ట్రాక్టర్ అశోక్‌నగర్ గ్రామ శివారు సమీపంలో చెరువు కట్టపైకి రాగానే డ్రైవర్ దరావత్ అశోక్ ఆకస్మికంగా బ్రేక్‌వేయడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో జాటోతు దంపతులు గోవింద్(55), జాటోతు బుచ్చమ్మ (35), మరో జంట గుగులోతు స్వామి(40), గుగులోతు కాంతమ్మ(38) కాగా, మరో మహిళ గుగులోతు సీత(30)గా గుర్తించారు. మృతులు జాటోతు గోవింద్ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉండగా గుగులోతు స్వామి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పిట్టల తిరుపతి తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంతో పర్శతండాలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా తీవ్ర గాయాలపాలైన ఆరుగురు వరంగల్ ఎంజీఎంలో చికిత్స తీసుకుంటున్నారు. మరో ముగ్గురుకి నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సంఘటనపై మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పెద్ది తీవ్ర దిగ్భ్రాంతి..
కుటుంబ సభ్యులకు ఓదార్పు
టాక్ట్రర్ బోల్తా పడి ఐదుగురు మృతిచెందిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తీరుపై పోలీసుల అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏసీపీ సంపత్‌రావు సర్సంపేట ప్రభుత్వాస్పత్రికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సంఘటన గిరిజన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపడం దురదృష్టకరమని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆస్ప త్రిలో ఉన్న క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించి ఆదుకుంటామని చెప్పారు.