Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజారోగ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న డాక్టర్లు
- పాశ్చాత్యదేశాల్లో ఫ్యామిలీ డాక్టర్లతోనే ప్రాథమిక వైద్యం...
- జబ్బుల నివారణలోనూ ఉపయోగం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లుంటారు. రోగాలు ముదిరితే స్పెషలిస్టుల వద్దకు సిఫారసు చేస్తారు. స్పెషలిస్టుల్లో ఒక్కో అవయవానికి ఒక ప్రత్యేక వైద్య నిపుణులుంటారు. అయితే ఎంబీబీఎస్ విద్య తర్వాత ఫ్యామిలీ ఫిజిషియన్లు కూడా ఉంటారు. సంబంధిత కోర్సులు కూడా ఉంటాయి. వీరు కుటుంబంలోని అన్ని వయస్సుల వారికి వచ్చే జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం, నివారణకు సంబంధించి నైపుణ్యాన్ని సంపాదించుకుని ఉంటారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో వీరిది కీలక పాత్ర అనీ, కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న దేశాలు, ప్రాంతాల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ల వ్యవస్థ బలంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబిచ్చింది. మానవాళికి కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠాల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ల అవసరాన్ని గుర్తించడం ఒకటి. మే 19న ప్రపంచవ్యాప్తంగా ఫ్యామిలీ ఫిజిషియన్ల దినోత్సవంగా పాటిస్తున్నారు.
దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు అవసరమైనంత మంది డాక్టర్లు లేకపోవడం, అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా ఉండటం అందరికి తెలిసిందే. ఇక ఫ్యామిలీ ఫిజిషియన్ల విషయానికి వస్తే కనీసం 2000 కుటుంబాలకు ఒకరుండాలని నిపుణులు సూచిస్తున్నారు. మెడికల్ పీజీలో ఫ్యామిలీ ఫిజిషియన్ సీట్లు పరిమితంగా ఉండటంతో సరిపడినంత మంది బయటికి రావడం లేదు. ఈ కొరతను తీర్చేందుకు జిల్లా ఆస్పత్రుల్లో రెండేండ్ల ఫ్యామిలీ మెడిసిన్ కోర్సును ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సీట్లను కూడా నీట్-పీజీ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజస్థాన్ 125, తమిళనాడు 48, పంజాబ్ ఐదు పీజీ డిప్లమో సీట్ల కోసం అనుమతి పొందాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు అలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎయిమ్స్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మాత్రమే ఇలాంటి కోర్సు అందుబాటులో ఉండగా, త్వరలోనే ఐఎంఏ - ప్యామిలీ మెడిసిన్ ఫెల్లోషిప్ కూడా ఈ కోర్సును నిర్వహించనున్నది. కనీసం 100 పడకలున్న ఆస్పత్రి ఈ సీట్లను పొందేందుకు అర్హత కలిగి ఉన్నది. బోధించేందుకు గైనిక్, పీడియాట్రిక్ తదితర విభాగాల కన్సల్టెంట్లు ఉండాలి. దేశంలో ప్రతి ఏడాది 50 వేల మంది వైద్యవిద్యలో వివిధ స్పెషాలిటీలను పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటిని ఒక లక్షకు పెంచాలని యోచిస్తు న్నారు. ఇదే క్రమంలో వాటికి సీట్లు పెరిగే అవకాశ మున్నా ఆరోగ్య తెలంగాణ సాధనలో ఫ్యామిలీ మెడిసిన్‌కు ఉన్న ప్రాధాన్యత రీత్యా డిప్లమో కోర్సును ప్రోత్సహించాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలి : డాక్టర్ శ్రీనివాస్
జిల్లా ఆస్పత్రుల్లో ఫ్యామిలీ మెడిసిన్ కోర్సులను ప్రారంభిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని అకా డమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజీషియన్స్ ఆప్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కోరారు. ఈ సీట్లను ఎంత ఎక్కువగా పెంచుకుంటే ఆరోగ్య తెలంగాణ లక్ష్యానికి అంత చేరువవుతామని అభిప్రాయపడ్డారు. సీట్లను పొందేందుకు అవసరమైన హార్డ్ కాపీని కేంద్రంలోని సంబంధిత అధికారులకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.