Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లీష్‌లోనే ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు ప్రశ్నాపత్రం
- తెలుగులో ప్రశ్నలు ఇవ్వని అధికారులు
- అర్థం కాక జవాబులు రాయలేని పరిస్థితి
- ఆందోళనలో విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1తోపాటు ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పేపర్-1, బయలాజికల్ సైన్స్ (బాటనీ, జువాలజీ) పేపర్-1 పరీక్షలను నిర్వహించారు. అయితే ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది వరకు ఉంటారు. వారికి ఇంగ్లీష్‌తోపాటు తెలుగు మాధ్యమంలోనూ ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నాపత్రంలోనూ ఇంగ్లీష్, తెలుగు వర్షన్ అంటూ ఇచ్చారు. కానీ ప్రశ్నలు కేవలం ఇంగ్లీష్‌లో ముద్రించి ఇవ్వడం గమనార్హం. తెలుగులో ప్రశ్నలు అనువాదం చేసి ముద్రించి ఇవ్వలేదు. దీంతో ఇంగ్లీష్‌లో ఉన్న ప్రశ్నలు అర్థం కాక విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. దీంతో సరిగ్గా జవాబులు రాయలేని పరిస్థితి నెలకొన్నది. విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనం. బోర్డు అధికారుల తప్పిదానికి విద్యార్థులు బలవుతున్నారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి బోర్డు తప్పిదాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు.
తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలు
బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1 ఇంగ్లీష్ మాధ్యమం, తెలుగు మాధ్యమం, ఉర్దూ మాధ్యమంలో తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలను ముద్రించి ఇచ్చారు. ఏకంగా తొమ్మిది ప్రశ్నలు తప్పుగా రావడం గమనార్హం. ప్రశ్నాపత్రాల తయారీలో ఇంటర్ బోర్డు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది. పరీక్షా సమయంలో అధికారులు ఎర్రట పేరుతో విద్యార్థులకు ప్రశ్నాపత్రంలోని తప్పులను సరిచేయాలంటూ చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారి (డీవో)కు సమాచారం పంపించారు. బుధవారం తొమ్మిది ప్రశ్నలకు ఇంటర్ బోర్డు నుంచి ఎర్రటలను పంపించి సరిచేశారు. రసాయన శాస్త్రం తెలుగు మాధ్యమంలో సెక్షన్ ఏ ఏడో ప్రశ్న గ్రూప్-2ఏ మూలకాలు అని రావాల్సి ఉండగా గ్రూప్-2 మూలకాలు అని వచ్చింది. ఇంగ్లీష్ మాధ్యమంలో సెక్షన్‌ఏ 12వ ప్రశ్నలో రిలేషన్షిప్ రావాల్సి ఉంటే రిలేషన్ అని ముద్రించారు. సెక్షన్ 3లో థర్మోడైనమిక్స్ అని ముద్రించాల్సి ఉండగా, థర్మోడైనమీస్ అని వచ్చింది. సెక్షన్ 16లో ఎక్స్ప్లెయిన్ అని రావాల్సి ఉండగా, ఎక్స్పాలిన్ అని ముద్రించారు. సెక్షన్ 18లో డిఫరెన్సెస్ అని ముద్రించాల్సి ఉంటే డిఫరెన్స్ అని ఇచ్చారు. ఇంటర్ బోర్డు నుంచి వచ్చే ఎర్రట అంటేనే ప్రశ్నాపత్రంలో ఉన్న తప్పును గుర్తించి సరిచేయడం. కానీ ఎర్రట తప్పు వచ్చిందంటూ మళ్లీ ఎర్రట పంపించిన ఘనట ఇంటర్ బోర్డు అధికారులకే చెల్లుతుంది. రసాయన శాస్త్రం ఇంగ్లీష్ మాధ్యమంలో సెక్షన్ బీలోని 16,18 ప్రశ్నలకు రెండోసారి ఎర్రట పంపించారు. కామర్స్ తెలుగు మాధ్యమంలో సెక్షన్ ఈ 28వ ప్రశ్నలో డెబిట్ చేసిన అని రావాల్సిన చోట చెల్లించినా అని వచ్చింది. సెక్షన్ ఎఫ్ 32వ ప్రశ్న జానకి అని ముద్రించాల్సి ఉండగా, జానికి అని ఇచ్చారు. రసాయన శాస్త్రం ఉర్దూ మాధ్యమంలోనూ సెక్షన్ సీ 32వ ప్రశ్న తప్పుగా వచ్చింది.
ప్రశ్నాపత్రాల తయారీలో బోర్డు నిర్లక్ష్యం : రామకృష్ణగౌడ్
ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల తయారీలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నదని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ విమర్శించారు. తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలను ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జవాబులు సీరియస్‌గా రాస్తున్న సమయంలో సీఎస్, డీవోలు వెళ్లి విద్యార్థులకు ఎర్రట గురించి చెప్తే కొంత అశాంతి నెలకొంటున్నదని వివరించారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నేటితో ముగియనున్న ఇంటర్ ప్రధాన పరీక్షలు
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రధాన పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈనెల ఆరో తేదీన ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1 పరీక్షలు నిర్వహించామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 4,47,295 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 4,24,438 (94.9 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 22,857 (5.1 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరించారు. ఐదుగురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.