Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 50 పెనాల్టీ వెనక్కి తీసుకోవాల్సిందే..
- ట్రాన్స్పోర్ట్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు
- ఓపిక నశించింది.. మంత్రిపై రాళ్ల దాడి తప్పదని ఆగ్రహం
- ఆటో, క్యాబ్, లారీ సంఘాల బంద్ సక్సెస్
- సమస్య పరిష్కరించకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తాం : తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ హెచ్చరిక
నవతెలంగాణ- హైదరాబాద్ సిటీబ్యూరో/విలేకరులు
ఫిట్నెస్ లేని వాహనాలపై రోజుకు రూ. 50 పెనాల్టీని వెనక్కి తీసుకోవాలని, ట్రాన్స్‌పోర్టు రంగం కార్మికుల నడ్డివిరుస్తున్న రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. బిల్లు అమలును ఆపకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించింది. రోడ్ సేఫ్టీ బిల్లు-2019ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రవాణా బంద్ చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ట్రాన్స్పోర్ట్ భవన్‌ను వేలాదిమంది రవాణారంగం కార్మికులు ముట్టడించారు. దాదాపు గంటకుపైగా రోడ్డుపై బైటాయించగా పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తరలించారు. ఈ సందర్భంగా ఆందోనళకారులు, పోలీసుల మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. బి.వెంకటేశం, ఆర్.మల్లేష్(ఏఐటీయూసీ), శ్రీకాంత్, అజరుబాబు (సీఐటీయూ), ఏ.సత్తిరెడ్డి(టీఏడీఎస్), వేముల మారయ్య(టీఆర్ఎస్కేవీ), జి.మల్లేష్‌గౌడ్ (ఐఎన్‌టీయూసీి), ఎండి.అమానుల్లాV్‌ా ఖాన్(టీఏడీ జేఏసీ), కిరణ్(ఐఎఫ్టీయూ), ఎం.రాజేందర్‌రెడ్డి (లారీ యూనియన్), క్యాబ్ జేఏసీ నేతలు రాజశేఖర్‌రెడ్డి, సలావుద్దీన్, సతీష్, రాజుగౌడ్, గడుసు శ్రీనివాస్ (టీఆర్ఎస్కేవీ) ముట్టడికి కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. రహదారి భద్రతా చట్టంలో భాగంగా ఫిట్నెస్ లేని ఆటో, ఇతర వాహనాలకు రోజుకు రూ.50 జరిమానా విధించి డ్రైవర్ల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ చట్టాన్ని ఆపాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలపై రూ.50 పెనాల్టీని రద్దు చేయాలని నెలన్నర రోజులుగా ఆందోళనలు చేస్తున్నామని, రవాణాశాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించామని గుర్తుచేశారు. కనీసం తమను పట్టించకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా కార్మికుల్లో ఓపిక నశిస్తోందని, మంత్రి కనిపిస్తే రాళ్లతో దాడి చేయాలన్నంత కోపం, బాధ కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతుండటంతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఇంధన అమ్మకాలను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని కనీస చార్జీని రూ.20 నుంచి రూ.40కి పెంచాలని, కిలోమీటరు చార్జీని రూ.11 నుంచి రూ.25కి పెంచాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త ఆటో పర్మిట్లు మంజూరు చేయాలని కోరారు. ఇన్సూరెన్సు ధరలు తగ్గించాలని, ఆటో, ట్రాలీ, క్యాబ్, లారీ, ప్రయివేటు బస్సు కార్మికులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి వారి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం రవాణాశాఖ మంత్రి సీసీకి వినతిపత్రం అందజేశారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆటో, లారీ యూనియన్ కార్మికులు ఆటోర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానకూడలి వద్ద సభ నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ రాజేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
వనపర్తి జిల్లా పరిధిలోని ఆత్మకూరు పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో గాంధీచౌక్ దగ్గర ధర్నా చేశారు. కొత్తకోటలో అంబ భవాని తుఫాన్ డ్రైవర్ ఓనర్స్ ఆటో డ్రైవర్స్ పెద్ద ర్యాలీ నిర్వహించారు. అమరచింత మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్యన్ రమేష్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
ట్రాలీ అసోసియేషన్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ నుండి మార్కెట్ మీదుగా ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హాజీపూర్ మండలంలోని వేంపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారు. లక్షెట్టిపేట్‌లో ఆటో యూనియన్ నాయకులు ముత్తె తిరుపతి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. నిర్మల్‌లో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.రాజన్న ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ఆఫీస్‌ను ఆటో కార్మికులు ముట్టడించారు. అనంతరం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. బంద్‌లో భాగంగా స్వచ్ఛందంగా ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టిఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 714 జీవో వల్ల మోటారు రంగ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఫిట్నెస్ చార్జీలు రోజుకు రూ.50 పెనాల్టీ పేరుతో వేల రూపాయల అపరాధ రుసుము కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కాల్వొడ్డులో దిష్టిబొమ్మ దహనం చేశారు. భద్రాచలంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఇల్లందులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను, 714 జీవో కాపీలను దహనం చేశారు.